దేశ వ్యాప్తంగా డాక్టర్ల సమ్మె

దేశ వ్యాప్తంగా డాక్టర్ల సమ్మె

కోల్‌కతాలో జూనియర్ డాక్టర్‌పై దాడిని ఖండిస్తూ దేశవ్యాప్తంగా నిరసనలు వ్యక్తమవుతున్నాయి. ఎయిమ్స్‌ రెసిడెంట్‌ వైద్యుల సంఘం పిలుపు మేరకు డాక్టర్లు ఈ సమ్మె చేపట్టారు. ఢిల్లీ సహా ముంబయి, బెంగళూరు, హైదరాబాద్‌ తదితర ప్రధాన నగరాల్లో వైద్యులు విధులు  బహిష్కరించి ఆందోళన చేస్తున్నారు. ఢిల్లీ ఎయిమ్స్ వైద్యులు వినూత్న రీతిలో నిరసన తెలిపారు. హెల్మెట్లు ధరించి విధుల్లో పాల్గొన్నారు. మరికొన్ని చోట్ల నలుపు రంగు రిబ్బన్‌ కట్టుకుని తమ నిరసన వ్యక్తం చేస్తున్నారు. ఢిల్లీలోని ఎయిమ్స్ వైద్యులు కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి హర్షవర్థన్ కు కలిశారు. వైద్యులపై జరుగుతున్న దాడులపై చర్యలు తీసుకోవాలంటూ డిమాండ్ చేశారు. 

మరోవైపు పశ్చిమబెంగాల్‌లో జూనియర్‌ వైద్యుల సమ్మె నాలుగో రోజుకు చేరింది. సమ్మె విరమించాలని రాష్ట్ర ముఖ్యమంత్రి మమతాబెనర్జీ హెచ్చరించినప్పటికీ వాటిని వైద్యులు బేఖాతరు చేశారు. దాడి చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకునేంతవరకు విధుల్లో చేరేది లేదని తేల్చి చెప్పారు. ప్రాణం పోసే డాక్టర్లకు రక్షణ కరువైందంటూ తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు.

ఎన్‌ఆర్‌ఎస్‌ వైద్య కళాశాలలో వైద్యులపై దాడి జరిగిన విషయం తెలిసిందే. చికిత్స పొందుతున్న ఓ రోగి సోమవారం రాత్రి చనిపోయాడు. దీంతో అతని బంధువులు ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఆసుపత్రి సిబ్బందిపై దాడికి పాల్పడ్డారు. ఈ ఘటనలో ఇద్దరు జూనియర్‌ వైద్యులు తీవ్రంగా గాయపడ్డారు. ఈ దాడిని నిరసిస్తూ బెంగాల్‌లోని అన్ని ప్రభుత్వ వైద్య కళాశాలలు, ఆసుపత్రులతో పాటు కొన్ని ప్రైవేటు ఆసుపత్రుల్లోని జూనియర్‌ వైద్యులు సమ్మెకు దిగారు.