ముస్లిం విద్యార్థులకు ప్రత్యేక డైనింగ్ రూమ్!!

ముస్లిం విద్యార్థులకు ప్రత్యేక డైనింగ్ రూమ్!!

పశ్చిమ బెంగాల్ మమతా బెనర్జీ సర్కార్ జారీ చేసిన ఒక ఆదేశంపై బీజేపీ విమర్శల వర్షం కురిపిస్తోంది. రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న స్కూళ్లలో ముస్లిం విద్యార్థుల సంఖ్య 70 శాతం కంటే ఎక్కువగా ఉంటే అక్కడ వారి కోసం ప్రత్యేకం డైనింగ్ రూమ్ నిర్మించాలని తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ) ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకోసం అన్ని స్కూళ్లను విద్యార్థుల వివరాలు పంపించాల్సిందిగా ఆదేశించారు.

ప్రభుత్వ ఆదేశాలను అమలు చేసేందుకు పశ్చిమ బెంగాల్ మైనారిటీ వ్యవహారాలు, మదర్సా విద్యా శాఖ ముస్లిం విద్యార్థుల సంఖ్య 70 శాతం కంటే ఎక్కువగా ఉన్న అన్ని ప్రభుత్వ పాఠశాలలు వెంటనే ఆయా వివరాలతో జాబితా పంపించాల్సిందిగా సూచించింది. 


కూచ్ బిహార్ జిల్లా అధికారి (మైనారిటీ వ్యవహారాలు) జారీ చేసిన ఆదేశాలలో 'ప్రత్యేక కార్యదర్శి 14/06/19న రాసిన లేఖ ప్రకారం మైనారిటీ విద్యార్థుల సంఖ్య 70 శాతం కంటే ఎక్కువగా ఉన్న ప్రభుత్వ, ప్రభుత్వ సహాయం పొందుతున్న విద్యాలయాల పేర్లను జూన్ 28 నాటికి పంపాల్సిందిగా పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం కోరడమైంది. ఈ పాఠశాలల్లో మధ్యాహ్న భోజనం పథకం కోసం ప్రత్యేక డైనింగ్ రూమ్ ఏర్పాటు చేసే ప్రతిపాదనను శాఖ ద్వారా ముందుంచనున్నాము' అని పేర్కొన్నారు.

జూన్ 28 వరకు విద్యాలయాల్లో అల్పసంఖ్యాక విద్యార్థుల శాతం తెలిపే గణాంకాలతో రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించే, ప్రభుత్వ సహాయం పొందే బడుల జాబితాను సేకరించాల్సిందిగా జిల్లా విద్యాధికారులు, జిల్లా స్కూళ్ల ఇన్ స్పెక్టర్లకు సర్కులర్ పంపించారు. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ఈ చర్యపై అభ్యంతరం తెలుపుతూ బెంగాల్ బీజేపీ అధ్యక్షుడు దిలీప్ ఘోష్ 'మతం ఆధారంగా విద్యార్థుల మధ్య అంతరాలు సృష్టిస్తారా? ఈ విభజన వెనుక ఏదైనా దురుద్దేశాలు ఉన్నాయా? ఇది మరో కుట్ర కాదు కదా!' అని ప్రశ్నించారు.