పాకిస్థానీ ఖైదీలను స్పెషల్ సెల్స్ కు తరలించిన బెంగాల్ సర్కార్

పాకిస్థానీ ఖైదీలను స్పెషల్ సెల్స్ కు తరలించిన బెంగాల్ సర్కార్

భారత్-పాకిస్థాన్ ల మధ్య ఉద్రిక్తతలు అంతకంతకూ పెరిగిపోతున్నాయి. దీంతో పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం తమ రెండు దిద్దుబాటు గృహాల్లో ఉన్న 14 మంది పాకిస్థానీ ఖైదీలను ప్రత్యేక బ్యారక్ లు, హై సెక్యూరిటీ సెల్స్ కి తరలించింది. రాజస్థాన్ లోని జైపూర్ సెంట్రల్ జైల్ లో ఓ 50 ఏళ్ల పాకిస్థానీ దోషిని తోటి ఖైదీలు కొట్టి చంపిన కొద్ది రోజులకే రాష్ట్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకొంది. 

'రాజస్థాన్ జైలు సంఘటన తర్వాత పాకిస్థానీ ఖైదీలను మిగతావారి నుంచి వేరు చేయాల్సిందిగా కచ్చితమైన ఆదేశాలు వచ్చాయి. వారిని అమెరికన్ సెంటర్ దాడి, మావోయిస్టుల వంటి బడా ఖైదీలను ఉంచే హై సెక్యూరిటీ సెల్స్ కు తరలించడం జరిగిందని' పశ్చిమ బెంగాల్ దిద్దుబాటు సేవల అధికారి తెలిపారు. ఈ 14 మంది ఖైదీల భద్రత కోసం మూడంచెల వ్యవస్థను ఏర్పాటు చేశారు.

'వీరిలో చాలా మంది తోటి ఖైదీలతో ఎంతో కలుపుగోలుగా వ్యవహరిస్తారు. కానీ పుల్వామా దాడి నేపథ్యంలో వారిని మిగతావాళ్లతో కలిపి ఉంచే రిస్క్ చేయలేమని' చెప్పారు. 14 మంది ఖైదీలలో నలుగురిని కోల్ కతా నగరంలోని ప్రెసిడెన్సీ కరెక్షనల్ హోమ్ లో, మిగతా పది మందిని డమ్ డమ్ కరెక్షనల్ హోమ్ లు ఉంచారు.