దీదీకి బిగ్‌ షాక్‌.. మరో మంత్రి గుడ్‌బై..

దీదీకి బిగ్‌ షాక్‌.. మరో మంత్రి గుడ్‌బై..

పశ్చిమ బెంగాల్‌ అసెంబ్లీ ఎన్నికలు దగ్గర పడుతున్న సమయంలో తృణమూల్‌ కాంగ్రెస్‌ అధినేత్రి, సీఎం మమతా బెనర్జీకి వరుస షాక్‌లు తగులుతున్నాయి... తృణమూల్‌ మంత్రులు, ఎమ్మెల్యేలను టార్గెట్‌ చేసి బీజేపీ ఆపరేషన్‌ ఆకర్ష్‌ కొనసాగిస్తోంది.. బీజేపీ, తృణమూల్‌ మధ్య మాటల యుద్ధమే కాదు.. దాడులు, హత్యలు సైతం జరుగుతున్నాయి. ఇప్పటికే కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షా సమక్షంలో.. తృణమూల్‌ కాంగ్రెస్‌ సీనియర్‌ నేత, రవాణాశాఖ మంత్రి సువేందు అధికారి బీజేపీలో చేరారు. ఆయనతో పాటు టీఎంసీ రెబెల్‌ నేతలు, పలువురు ఎమ్మెల్యేలు సైతం బీజేపీకి గూటికి చేరారు.. ఇప్పుడు మరోనేత దీదీకి షాక్‌ ఇచ్చాడు... మంత్రి పదవికి, తృణమూల్‌ కాంగ్రెస్‌ పార్టీకి రాజీనామా చేశారు అటవీశాఖ మంత్రి రాజీవ్‌ బెనర్జీ.. 

రాజీనామా అనంతరం మీడియాతో మాట్లాడిన రాజీవ్ బెనర్జీ.. మ‌నో వేద‌న‌తోనే తాను రాజీనామా చేయాల్సి వ‌చ్చిందన్నారు. మంత్రిగా తాను ఎన్నో ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వచ్చింది.. ఓ ద‌శ‌లో తీవ్ర మ‌నోవేద‌న‌కు గురయ్యా.. చివ‌రికి ప‌ద‌వికి రాజీనామా చేయాల్సి వ‌చ్చిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ నిర్ణయం న‌న్ను ఎంత‌గానో బాధించిందన్న ఆయన.. అయినా రాజీనామా చేయాల్సి వ‌చ్చిందన్నారు. ఇదే సమయంలో.. త‌న‌కు మంత్రి ప‌దవి ఇచ్చిన సీఎం మ‌మ‌తా బెన‌ర్జీకి కృత‌జ్ఞతలు తెలిపారు రాజీవ్ బెనర్జీ.. అయితే, మంత్రి ప‌ద‌వికి రాజీనామా చేసినా.. బెంగాల్ ప్రజ‌లకు సేవ చేస్తూనే ఉంటానని ప్రకటించారు. ఇప్పుడు తృణమూల్‌ నేతలకు, సీఎం మమతా బెనర్జీకి కొత్త టెన్షన్‌ మొదలైంది.. రాజీవ్‌ బెనర్జీ కూడా కమలం పార్టీ గూటికే చేరతారా? ఆయన వెంట ఇంకా ఎవరైనా వెళ్లే అవకాశం ఉందా? అనే సమాచార సేకరణలో పడిపోయారు. అయితే, పార్టీలో బుజ్జగింపుల పర్వం కొనసాగుతున్నా.. వరుసగా మంత్రులు, ఎమ్మెల్యేలు, నేతలు పార్టీని వీడడం పెద్ద చర్చగా మారిపోయింది. అసెంబ్లీ ఎన్నికల ముందు జరుగుతోన్న ఈ పరిణామాలు దీదీకి కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నాయి.