మాజీ క్రికెటర్ బ్రియాన్ లారాకు అస్వస్థత

మాజీ క్రికెటర్ బ్రియాన్ లారాకు అస్వస్థత

వెస్టిండీస్ మాజీ క్రికెటర్ బ్రియాన్ లారా అస్వస్థతకు గురయ్యారు. ఛాతి నొప్పి రావడంతో ఆయనను ముంబయిలోని గ్లోబల్ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. లారా గత కొన్ని రోజులుగా ముంబయిలోని స్టార్‌ స్పోర్ట్స్‌ స్టూడియోలో కామెంటరీ బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మొన్నటివరకూ ఐపీఎల్‌ కోసం పనిచేసిన ఆయన ప్రస్తుతం ప్రపంచకప్‌ కోసం తన సేవలు అందిస్తున్నారు. లారా అస్వస్థతకు గురయ్యారన్న సమాచారం తెలియగానే స్టార్ స్పోర్ట్స్‌ అధికారులు గ్లోబల్‌ ఆస్పత్రికి చేరుకున్నారు. ఓ హోటల్‌లో జరుగుతున్న కార్యక్రమానికి హాజరైన లారా.. మధ్యలో అస్వస్థతకు గురికావడంతో ఆస్పత్రిలో చేర్చించి చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం లారా ఆరోగ్యం నిలకడగానే ఉందని ఆయన సన్నిహితులు తెలిపారు.