125 పరుగుల తేడాతో టీమిండియా గెలుపు

125 పరుగుల తేడాతో టీమిండియా గెలుపు

ఐసీసీ ప్రపంచ కప్ లో వరుస విజయాలతో దూసుకెళుతున్న టీమిండియా తన ఖాతాలో మరో విజయాన్ని నమోదు చేసింది. మాంచెస్టర్ వేదికగా వెస్టిండీస్ తో జరిగిన మ్యాచ్ లో టీమిండియా ఘనవిజయం సాధించింది. 269 విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన విండీస్ ను టీమిండియా బౌలర్లు కట్టడి చేయడంతో 34.2 ఓవర్లలో 143 పరుగులకు ఆలౌట్ అయింది. దీంతో టీమిండియా 125 పరుగులతో విజయం సాధించింది. పేసర్లు మహహ్మద్ షమీ, బుమ్రా దాటికి కరేబియన్ బ్యాట్స్‌మన్లు వరుసగా పెవిలియన్ చేరుకున్నారు. క్రిస్ గేల్ (6), , షేయ్ హోప్ (5), నికోలస్ పూరన్ (28), హెట్ మేయర్ (18), హోల్డర్ (6), బ్రెత్‌వైట్ (1), అలెన్ (1) తక్కువ స్కోరుకే పరిమితమయ్యారు. టీమిండియా బౌలర్లలో మహమ్మద్ షమీ 4, బుమ్రా, చాహాల్ కు చెరో రెండు వికెట్లు, పాండ్య, కుల్దీప్ యాదవ్ కు చెరో వికెట్ దక్కింది. 

అంతకుముందు టాస్ గెలిచిన టీమిండియా బ్యాటింగ్ ఎంచుకుంది. కోహ్లీ(72; 82 బంతుల్లో 8 ఫోర్లు), ధోనీ(56 నాటౌట్; 61 బంతుల్లో, 3 ఫోర్లు, 2 సిక్సులు) హాఫ్ సెంచరీలతో చెలరేగారు. విండీస్ బౌలర్లను సమర్ధంగా ఎదుర్కొన్నారు. దీంతో నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 268 పరుగులు సాధించింది. ఓపెనర్ కేఎల్ రాహుల్ ( 48; 64 బంతుల్లో 6 ఫోర్లు), హర్ధీక్ పాండ్య(46; 38 బంతుల్లో, 3 ఫోర్లు, 2 సిక్సులు) చక్కగా రాణించాడు. రోహిత్ శర్మ(18), విజయ్ శంకర్ (14), మహ్మద్ షమీ (0) తక్కువ స్కోరుకే పెవిలియన్ చేరారు. విండీస్ బౌలర్లలో కీమర్‌ రోచ్‌ మూడు వికెట్లు తీయగా, షెల్డన్‌, హోలర్డ్‌ చెరో వికెట్లు పడగొట్టారు.