బండరాయితో తలపై బాదుకున్న రాజాసింగ్..! (వీడియో వైరల్‌)

బండరాయితో తలపై బాదుకున్న రాజాసింగ్..! (వీడియో వైరల్‌)

బుధవారం అర్ధరాత్రి హైదరాబాద్ ఓల్డ్ సిటీలో హైడ్రామా నడిచింది... జుమ్మెరాత్ బజార్‌లో రాత్రి సమయంలో రాణి అవంతి బాయ్ లోథ్ విగ్రహాన్ని ప్రతిష్టించేందుకు ఓ వర్గం ప్రయత్నించడంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. విగ్రహ ప్రతిష్టాపనను పోలీసులు అడ్డుకున్నారు. దీంతో ఆందోళనకు దిగడం.. ఆందోళనకారులకు మద్దతుగా గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ ఘటనా స్థలానికి చేరుకోవడంతో వాతావరణం ఉద్రిక్తం మారిపోయింది. అనుమతి లేకుండా విగ్రహాన్ని పెట్టడం కుదరదంటూ పోలీసులు అడ్డునే ప్రయత్నం చేయడంతో ఒక్కసారిగా ఓ బండరాయితో తీసుకుని తన తలపై ఎమ్మెల్యే రాజా సింగే బాదుకున్నట్టు సోషల్ మీడియాలో ఓ వీడియో వైరల్ అయిపోయింది. విగ్రహ ప్రతిష్టాపనను అడ్డుకునేందుకు యత్నించిన పోలీసులపై ఆగ్రహంతో ఊగిపోతూ ఆయన తన తలపై బండరాయితో బాదుకోగా... పోలీసులు అడ్డుకునే ప్రయత్నం చేశారు. రాత్రి ఉద్రిక్త పరిస్థితులు నెలకొండం.. పోలీసులు లాఠీచార్జ్ చేయడంతోనే రాజాసింగ్‌కు గాయాలయ్యాయని ప్రచారం జరిగింది. ఈ ఘటనపై వెస్ట్ జోన్ డీసీపీ ఏఆర్ శ్రీనివాస్ వివరణ ఇచ్చారు. 

రాత్రి 12.30 సమయంలో జూమెరత్ బజార్ లో రాణి అవంతి భాయ్ విగ్రహం పాతది తొలిగించి కొత్త విగ్రహం పెట్టె ప్రయత్నంచేశారు.. గతం కన్నా పెద్ద విగ్రహం ఏర్పాటు చేస్తున్నారు.. దానికి ఎలాంటి అనుమతి లేదని పోలీసులు చెప్పారు.. గతం లో 10 అడుగుల విగ్రహం ఉంటే.. ఇప్పుడు 25 అడుగుల విగ్రహాన్ని పెట్టే ప్రయత్నం చేశారు.. ఘటనా స్థలంలో ఎమ్మెల్యే రాజా సింగ్‌తో పాటు అతని అనుచరులు పోలీసులపై దురుసుగా ప్రవర్తించారని వెస్ట్ జోన్ డీసీపీ శ్రీనివాస్ తెలిపారు. నిన్నటి ఘటనలో పోలీసుల లాఠీఛార్జ్ చేయలేదు... తన చేతిలో ఉన్న రాయితోనే రాజాసింగ్ తన తలపై బాదుకున్నారని చెప్పారు. ఇక పోలీసుల పైనే రాజా సింగ్ చేయి చేసుకున్నాడు తప్ప.. రాజా సింగ్‌ను పోలీసులు ఏమీ అనలేదని స్పష్టం చేశారు. ఈ ఘటనలో రాజాసింగ్‌పై కేసు బుక్ చేశామని... 143, 145, 152, 153 (ఏ), 353  సెక్షన్ల కింద కేసు నమోదు చేశామని వెల్లడించారు డీసీపీ శ్రీనివాస్.