వీడిన రాంప్రసాద్ హత్య కేసు మిస్టరీ..

వీడిన రాంప్రసాద్ హత్య కేసు మిస్టరీ..

హైదరాబాద్‌ పంజాగుట్టలో హత్యకు గురైన విజయవాడకు చెందిన వ్యాపారి రాంప్రసాద్ హత్య కేసు మిస్టరీని ఛేదించారు పోలీసులు.. వ్యాపారలావాదేవీల కారణంగానే హత్య జరిగిందని పోలీసులు నిర్ధారించారు. రాంప్రసాద్ హత్యలో ప్రధాన సూత్రధారి కోగంటి సత్యమని వెల్లడించారు వెస్ట్ జోన్ డీసీపీ శ్రీనివాస్.. రాంప్రసాద్ హత్య కేసు మిస్టరీపై మీడియాతో మాట్లాడిన ఆయన.. ఈ కేసులో కోగంటి సత్యం, శ్యామ్‌తో పాటు మరో ముగ్గురిని అరెస్ట్ చేసినట్టు తెలిపారు. ఈ హత్య కేసులో మొత్తం 11 మంది నిందితులుగా ఉన్నారని వెల్లడించారు. రాంప్రసాద్, కోగంటి సత్యం చాలా ఏళ్ల నుంచి వ్యాపారం చేస్తున్నారు.. రాంప్రసాద్‌కు సత్యం రూ.70 కోట్లు బాకీపడ్డాడు.. దీంతో రూ.23 కోట్లు చెల్లించాల్సిందిగా సెటిల్ చేశారు. కానీ, పథకం ప్రకారం రాంప్రసాద్‌ను హత్య చేశారని తెలిపారు డీసీపీ. హత్యకు నెలరోజుల ముందే రెక్కీ నిర్వహించారని.. హత్య చేసేందుకు బొలోరేలో శ్యామ్ ఆయుధాలు తీసుకొచ్చాడని వెల్లడించారు. రాంప్రసాద్ హత్య సమయంలో నిందితులు ఓ స్కూటీని కూడా ఉపయోగించారన్నారు డీసీపీ శ్రీనివాస్.. ఆంజనేయప్రసాద్, బాజీ, రాములు కలిసి రాంప్రసాద్‌ను పొడిచారని.. హత్య చేసిన ముగ్గురి నేరచరిత చెక్ చేస్తున్నట్టు వెల్లడించారు. కోగంటి సత్యంపై అనుమానం వచ్చే విచారణ చేస్తే విషయం బయటపడిందని తెలిపారు. హత్య జరిగినప్పుడు కోగంటి సోమాజిగూడ యశోద ఆస్పత్రి దగ్గరే ఉన్నాడు.. రాంప్రసాద్ హత్య విషయం తెలిసిన తర్వాతే అక్కడి నుంచి వెళ్లిపోయినట్టు మీడియాకు వివరించారు. కోగంటి సత్యంతో గొడవల కారణంగానే 2015లో రాంప్రసాద్ హైదరాబాద్‌ వచ్చినట్టు డీసీపీ తెలిపారు.