వరల్డ్ లెవెన్‌పై విండీస్ విజయం

వరల్డ్ లెవెన్‌పై విండీస్ విజయం

గురువారం లార్డ్స్ వేదికగా వరల్డ్ లెవెన్‌, వెస్ట్ విండీస్ జట్ల మధ్య జరిగిన టీ-20 ఛారిటీ మ్యాచ్‌లో వెస్ట్ విండీస్ ఘన విజయం సాధించింది. ఆల్ రౌండ్ ప్రదర్శనతో విండీస్ జట్టు 72 పరుగుల తేడాతో వరల్డ్ లెవెన్‌ పై సునాయాస విజయాన్ని అందుకుంది. టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్ కు దిగిన విండీస్ నిర్ణీత 20 ఓవర్లలో నాలుగు వికెట్ల నష్టానికి 199 పరుగులు చేసింది. విండీస్ ఓపెనర్ గేల్(28 బంతుల్లో 18) పరుగులు చేయడంలో ఇబ్బంది పడ్డాడు. మరో ఓపెనర్ లెవిస్ మాత్రం బౌలర్లపై విరుచుకుపడి బౌండరీల వర్షం కురిపించాడు. లెవిస్(58; 26 బంతుల్లో 5 సిక్సర్లు, 5 ఫోర్లు) అర్ధ శతకం సాధించాడు. గేల్ నిష్క్రమణ అనంతరం ఫ్లెచర్(7) కూడా తక్కువ పరుగులకే పరిమితమయ్యాడు. ఆ తర్వాత గ్రీస్ లోకి వచ్చిన శామ్యూల్స్(43), రామ్‌దిన్(44)లు కూడా స్కోర్ బోర్డును పరుగులు పెట్టించారు. ఇన్నింగ్స్ చివర్లో రస్సెల్(21) కూడా రాణించడంతో భారీ స్కోర్ చేసింది విండీస్. వరల్డ్ లెవెన్ బౌలర్లలో రషీద్ ఖాన్ రెండు వికెట్లు తీసాడు.

అనంతరం భారీ లక్ష్యాన్ని ఛేదించేందుకు బ్యాటింగ్ కు దిగిన వరల్డ్ లెవెన్ జట్టు 16.4 ఓవర్లలో 127 పరుగులకే ఆలౌట్ అయింది. హేమాహేమీలున్నజట్టులో నలుగురు మాత్రమే రెండంకెల స్కోరు చేస్తే.. ముగ్గురు డక్ అవుట్ అయ్యారు. శ్రీలంక బ్యాట్స్‌మన్ పెరీరా(61) ఒక్కడే ఒంటరి పోరాటం చేసినా ఫలితం లేకపోయింది. ఓపెనర్లు ఇక్బాల్(2), రొంచి(0) సహా బిల్లింగ్స్(4), కార్తీక్(0)లు జట్టు స్కోర్ 8 పరుగులకే పెవిలియన్ చేరారు. వరల్డ్ లెవెన్ జట్టులో స్థానం పొందిన భారత ఆటగాడు దినేష్ కార్తీక్(0) విఫలమయ్యాడు. పెరీరాకు సహకరించే బ్యాట్స్ మెన్ లేకపోవడంతో వరల్డ్ లెవెన్ జట్టు 127 పరుగులకే పరిమితమయింది. విండీస్ బౌలర్లలో విలియమ్స్ మూడు వికెట్లు తీసాడు. అర్ధ శతకం చేసిన లెవిస్‌కు 'మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్' అవార్డు లభించింది.

Photo: FileShot