జనసంద్రంగా మారిన ఢిల్లీ..యూపీ బోర్డర్...

జనసంద్రంగా మారిన ఢిల్లీ..యూపీ బోర్డర్...

దేశంలో కరోనా కేసులు రోజు రోజుకు పెరిగిపోతున్నాయి.  కరోనా వైరస్ ను ఎదుర్కొనడానికి కావాల్సిన అత్యాధునిక వైద్య సౌకర్యాలు మన దగ్గర లేవు అన్నది వాస్తవం.  టెక్నాలజీని ఉపయోగించుకున్నా దేశంలో ఉన్న జనాభా దృష్ట్యా కరోనా కేసులు భారీగా పెరిగే ఆ టెక్నాలజీ కూడా సరిపోదు.  ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇండియా చేయాల్సింది ఒక్కటే ప్రతి పౌరడు ఇంటికే పరిమితం కావడం.  అందుకే భారత ప్రభుత్వం లాక్ డౌన్ ను తీసుకొచ్చింది.  ప్రజలంతా ఇళ్ళకే పరిమితమైతే దేశంలో కరోనా వ్యాధిని తరిమి కొట్టొచ్చు.  అయితే, ఈ లాక్ డౌన్ వలన రోజువారీ వలస కూలీలు నానా ఇబ్బందులు పడుతున్నారు.  తిండి దొరక్క, పనులు లేక ఉన్న ప్రాంతం నుంచి సొంత రాష్ట్రాలకు తిరిగి వెళ్లేందుకు ప్రయత్నం చేస్తున్నారు.  

వాహన సౌకర్యాలు అందుబాటులో లేవు.  కరోనా కారణంగా బోర్డర్స్ ను మూసివేశారు. దేశ రాజధాని ఢిల్లీకి లక్షలాది మంది ఉత్తరప్రదేశ్ నుంచి వచ్చి రోజువారీ కూలికి పనిచేస్తున్న వ్యక్తులు ఉన్నారు.  వారు ఉపాది లేకపోవడంతో తిరిగి సొంత రాష్ట్రం ఉత్తరప్రదేశ్ కు వెళ్లేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు.  ఢిల్లీ నుంచి ఉత్తరప్రదేశ్ కు కాలినడకన పయనం అయ్యారు.  ఇప్పుడు ఢిల్లీ, ఉత్తర ప్రదేశ్ బోర్డర్ లో ఎక్కడ చూసినా జనాలు కనిపిస్తున్నారు.  సామాజిక దూరం అన్నది కనిపించడం లేదు.  వలస కూలీలు ఎవరూ కూడా రాష్ట్రం వదిలి వెళ్లొద్దని, ఇది తగిన సమయం కాదని, ఎవరికి ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూస్తామని ఢిల్లీ ప్రభుత్వం హామీ ఇస్తున్నా జనాలు మాత్రం సొంత రాష్ట్రం ఉత్తరప్రదేశ్ వెళ్లేందుకు ప్రయత్నం చేస్తున్నారు.  దీంతో ఢిల్లీ నుంచి ఉత్తర ప్రదేశ్ వెళ్ళే రహదారులన్నీ వలస కూలీలతో కిటకిటలాడుతున్నాయి..