అసలు ఎక్మో ట్రీట్మెంట్ అంటే ఏమిటో తెలుసా ?

అసలు ఎక్మో ట్రీట్మెంట్ అంటే ఏమిటో తెలుసా ?

కరోనా పేరు వింటేనే జనం హడలిపోతున్నారు. వరుసగా సంభవించే మరణాలు మరింతగా భయపెడుతున్నాయ్. ప్రాణాపాయ స్థితిలో ఉన్న బాధితులకు ఎక్మో ట్రీట్‌మెంట్‌తో పునర్జన్మ ప్రసాదించవచ్చని అంటున్నారు డాక్టర్లు. ఇంతకీ...ఎక్మో ట్రీట్‌మెంట్‌ అంటే ఏంటి?అది ఎలా పని చేస్తుంది?
కరోనా బాధితుల‌కు చేసే చికిత్సలో ప్రస్తుతం ఎక్మో ట్రీట్‌మెంట్‌ పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. రోగులు క్రిటికల్ కండిషన్‌‌లో ఉన్నపుడు నేరుగా రక్తంలోకి ఆక్సిజన్ ఎక్కించి డాక్టర్లు పునర్జన్మ ప్రసాదించారు. వరంగల్ జిల్లాకు చెందిన పీడియాట్రిషియన్‌‌ డాక్టర్ దయానంద్ సాగర్‌‌‌‌ జూలై 9న హైదరాబాద్‌లోని ఓ కార్పొరేట్ హాస్పిటల్‌‌లో అడ్మిట్ అయ్యారు. 

ఆయనకు శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు తలెత్తాయి. ఆక్సిజన్ లెవల్స్ పడిపోయాయి. ఆక్సిజన్ సపోర్ట్‌‌ ఇచ్చినా...వెంటిలేటర్‌పైకి మార్చినా పరిస్థితిలో ఎలాంటి మార్పులేదు. దీంతో ఫ్యామిలీ మెంబర్స్ అంగీకారంతో ఎక్స్‌‌ట్రాకార్పొరియల్ మెంబరేన్స్ ఆక్సిజనైజన్‌‌ ద్వారా ట్రీట్‌మెంట్ చేశారు. ఈ విధానంలో నేరుగా రక్తంలోకి ఆక్సిజన్ ఎక్కించారు వైద్యులు. 12 రోజుల తర్వాత దయానంద్ పూర్తిగా కోలుకున్నారు. దేశంలో ఇప్పటి వరకూ నలుగురు కరోనా పేషెంట్లకు ఎక్మో పద్ధతిలో ట్రీట్‌‌మెంట్ ఇచ్చారు. సౌత్ ఇండియాలో ఎక్మో ట్రీట్‌‌మెంట్ ఇదే మొదటిది.

అకస్మాత్తుగా తీవ్ర జ్వరంతో ఐసీయూలో చేరిన 43 ఏళ్ల వ్యక్తికి ఒక్కసారిగా గుండె కొట్టుకోవడం ఆగిపోయింది. ఎంతో ఆరోగ్యంగా ఉండే వ్యక్తికి ఇలా అయ్యే సరికి కుటుంబ సభ్యులు ఒక్కసారిగా షాకయ్యారు. వెంటనే స్పందించిన డాక్టర్లు, ఇటీవలే తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలితకు అందించిన ఎక్మో చికిత్సను సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ అయిన వ్యక్తికి అందించారు. దీంతో ఆ వ్యక్తి గుండెను 24 గంటల లోపల తిరిగి మామూలు స్థాయికి చేరుకునేలా చేశారు. 
జయలలితకు, ఇప్పుడు సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌కు అందించిన ఎక్మో చికిత్సలో ఓ యంత్ర పరికరం ద్వారా రక్తాన్ని పేషెంట్ శరీరంలోకి ప్రవహించేలా చేశారు. కార్బన్డయాక్సైడ్ను బయటికి తీస్తూ... ఆక్సిజన్ను ఎర్ర రక్తకణాల్లోకి పంపిస్తూ గుండెను మామూలు స్థితికి చేరుకునేలా కృషి చేశారు. ఐతే...ఈ చికిత్సలో టెకీ తిరిగి మామూలు స్థాయికి చేరుకున్నారు. జయలలిత ఆరోగ్య పరిస్థితి ఆ చికిత్సకు సపోర్టు చేయకపోవటంతో ఆమె ప్రాణాలు వదిలారు.

నిజానికి...ఇండియాలో ఎక్మో చికిత్సపై అవగాహన తక్కువ. చాలా మంది పేషెంట్లు గుండె కొట్టుకోవడం ఆగిపోయి మరణిస్తున్నప్పటికీ, వారికి ఈ ట్రీట్‌మెంట్ అందుబాటులో ఉండటం లేదు. విషమ పరిస్థితికి చేరుకున్న గుండెను సైతం ఈ చికిత్స ద్వారా సాధారణ పరిస్థితికి తీసుకురావచ్చని వైద్యులు చెబుతున్నారు.