రాఫెల్ ఆడియో టేప్ లీక్ వివాదంలో నిజమేంత?

రాఫెల్ ఆడియో టేప్ లీక్ వివాదంలో నిజమేంత?

బుధవారం లోక్ సభ రాఫెల్ వివాదంలో లీకైన ఓ ఆడియో టేప్ కారణంగా దద్దరిల్లింది. రాఫెల్ ఫైటర్ జెట్ కొనుగోలు ఒప్పందంపై గోవా మంత్రి విశ్వజిత్ రాణె ఓ జర్నలిస్ట్ తో ఫోన్ లో మాట్లాడుతుండగా రికార్డ్ అయినట్టు చెబుతున్న ఆడియో టేప్ సభలో పెను కలకలం సృష్టించింది. కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ఆ టేపుని వినేందుకు అనుమతించాలని స్పీకర్ సుమిత్రా మహాజన్ ను అభ్యర్థించారు. కానీ దాని సాధికారతను ధ్రువీకరించేందుకు మాత్రం ముందుకు రాలేదు. దీంతో కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ ఎదురుదాడికి దిగారు. రాహుల్ గాంధీ అబద్ధాలాడతారని, పదేపదే అసత్యాలు చెబుతున్నారని విమర్శించారు. రాఫెల్ కొనుగోలు వివాదంపై చర్చను ప్రారంభిస్తూ రాహుల్ గాంధీ ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి పార్లమెంటుకి వచ్చి ఈ అంశంపై ప్రశ్నలను ఎదుర్కొనే దమ్ము లేదని విమర్శించారు. ప్రధాని తన గదిలో దాక్కున్నారని ఎద్దేవా చేశారు.

రాఫెల్ ఆడియో టేప్ లీక్ వివాదం:

1. ఈ వివాదాస్పద ఆడియో టేపుని కాంగ్రెస్ ముఖ్య అధికార ప్రతినిధి రణ్ దీప్ సూర్జేవాలా బయటపెట్టారు. ఇందులో గోవా మంత్రి విశ్వజిత్ రాణె గుర్తు తెలియని మరో వ్యక్తితో సంభాషిస్తున్నారు. ఆ వ్యక్తి ఒక జర్నలిస్ట్ అని భావిస్తున్నారు. గత వారం జరిగిన కేబినెట్ సమావేశంలో గోవా ముఖ్యమంత్రి మనోహర్ పారికర్ తన బెడ్రూమ్ లో రాఫెల్ డీల్ కి సంబంధించిన ఒక ఫైల్, పలు పత్రాలు ఉన్నాయని చెప్పినట్టు రాణె అంటున్నట్టు టేపులో ఉంది. అవసరమైతే వాటిని బయట పెడతానని పారికర్ అన్నట్టు సూర్జేవాలా చెప్పారు.

2. ప్రస్తుతం గోవా ముఖ్యమంత్రి అయిన పారికర్, 36 జెట్ల కొనుగోలు ఒప్పందంపై ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సంతకాలు చేసినపుడు కేంద్ర రక్షణ మంత్రిగా ఉన్నారు.

3.ఈ ఆరోపణలను పారికర్ కొట్టిపారేశారు. తన కేబినెట్ సహచరులెవరితో తాను రాఫెల్ డీల్ గురించి ఎప్పుడూ చర్చించలేదని ఆయన ట్వీట్ చేశారు. ‘రాఫెల్ పై ఇటీవల సుప్రీంకోర్ట్ తీర్పుతో వాళ్ల చెప్పేవన్నీ అబద్ధాలని తేలిపోయింది. దీంతో వాస్తవాలను వక్రీకరించేందుకు తమ శాయశక్తులా ప్రయత్నించి కాంగ్రెస్ పార్టీ ఈ ఆడియో క్లిప్ ను తయారుచేసి విడుదల చేసింది. కేబినెట్ సమావేశంలో కానీ, మరే ఇతర సమావేశంలో కానీ రాఫెల్ పై ఎలాంటి చర్చ జరగలేదని’ పారికర్ బుధవారం తన పోస్ట్ లో తెలిపారు.

4. రాఫెల్ డీల్ పై చర్చ జరుగుతుండగా రాహుల్ గాంధీ ఆ ఆడియో టేపుని లోక్ సభలో వినిపించేందుకు అనుమతి కోరారు.

5. దాని ధ్రువీకరించాల్సిందిగా జైట్లీ డిమాండ్ చేశారు. అలా చేసేందుకు రాహుల్ గాంధీ నిరాకరించారు. ‘అదంతా నకిలీదని ఆయనకు బాగా తెలుసు. అందుకే దానిని ధ్రువీకరించేందుకు భయపడుతున్నారని’ జైట్లీ అన్నారు. ‘ఈ మనిషి పదేపదే అబద్ధాలు చెబుతున్నాడని’ ఆరోపించారు.

6. ఆ ఆడియో క్లిప్ వక్రీకరించి తయారుచేసినట్టు విశ్వజిత్ రాణె అన్నారు. ఈ వ్యవహారంపై దర్యాప్తునకు ఆదేశించాల్సిందిగా రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరినట్టు బీజేపీ అధ్యక్షుడు అమిత్ షాకు తెలియజేశారు.

7. నకిలీ ఆడియో టేప్ తో కాంగ్రెస్ తనను రాఫెల్ డీల్ వివాదంలోకి లాగుతోందని రాణె ఆరోపించారు. ‘ఇవాళ తన గొంతుగా చెబుతున్న టేపు పూర్తిగా అవాస్తవం, తర్కానికి అందనిదని’ రాణె అన్నారు. టేపులో ఉన్న గొంతు తనది కానే కాదన్నారు.

8. ముఖ్యమంత్రి పారికర్ కు దీనిపై రాణె లేఖ రాశారు. ‘తక్షణమే పోలీస్ దర్యాప్తు కోరుతూ ముఖ్యమంత్రి మనోహర్ పారికర్ కు తను లేఖ రాశానని, ఆకతాయి చేష్టలను బయటపెట్టేందుకు క్రిమినల్ ఇన్వెస్టిగేషన్ జరపాలని’ కోరినట్టు చెప్పారు.

9. ‘ఎవరో కొందరు ఆకతాయి చేష్టలకు పాల్పడుతున్నారని ముఖ్యమంత్రికి తెలియజేయాలనుకుంటున్నాను. ఈ వ్యవహారంపై దర్యాప్తు చేసి వాళ్లని చట్టం 
ముందు నిలబెట్టాలని కోరుతున్నానని’ ఆయన పారికర్ కు రాసిన లేఖలో పేర్కొన్నారు.

10. మాజీ కాంగ్రెస్ నేత అయిన రాణె, 2017 అసెంబ్లీ ఎన్నికల తర్వాత బీజేపీలో చేరారు. ఆయనను మంత్రిగా చేశారు. ‘తను బీజేపీలో చేరినప్పటి నుంచి కాంగ్రెస్ తనను టార్గెట్ చేసిందని’ ఆయన ఆరోపించారు.

అయితే ఈ టేపులో రాణెతో మాట్లాడిన వ్యక్తి జర్నలిస్టేనా? మరెవరైనానా? అసలీ టేపు ఎలా దొరికింది? ఇది ఎవరైనా తయారుచేశారా? లేక నిజమైనదేనా? నిజమైనదైతే రాహుల్ ఎందుకు ధ్రువీకరించలేదనే అంశాలపై ఇంకా సందేహాలు తీరాల్సి ఉంది.