రిపబ్లిక్ డే స్పెషల్ : అసలు ఎందుకు జరుపుకుంటారో తెలుసా ?

రిపబ్లిక్ డే స్పెషల్ : అసలు ఎందుకు జరుపుకుంటారో తెలుసా ?

1947లో లభించిన స్వాతంత్రం తర్వాత గణతంత్ర దేశంగా 1950 జనవరి 26న భారత్ అవతరించింది. అదే ఈరోజు మనం జరుపుకోబోయే రిపబ్లిక్ డే. ఈ రోజు ప్రాముఖ్యత తెలియని జనానికి ఇదొక సాధారణ సెలవు రోజు. అయితే అసలు రిపబ్లిక్‌డేను జనవరి 26నే ఎందుకు జరుపుకుంటున్నాం అనే విషయం కూడా చాలా మందికి తెలియదు. అలా తెలియని వారికీ తెలియచెప్పే ప్రయత్నమే ఇది. మన దేశానికి 1947 ఆగస్టు 15న స్వాతంత్రం సిద్ధించింది అలాగే 1950 జనవరి 26 నుంచి రాజ్యాంగం అమల్లోకి వచ్చింది. కాబట్టి ఏటా అదే తేదీన రిపబ్లిక్ డే జరుపుకుంటున్నాం అని మనలో కొంత మందికి తెలుసు. అయితే అది నిజం కాదు.

ఎందుకంటే నిజానికి భారత రాజ్యాంగాన్ని 1949 నవంబరు 26నే ఆమోదించారు. దీనిని అమలు చేసే తేదీకి ఒక ప్రాముఖ్యత ఉండాలనే ఉద్దేశంతో రెండు నెలలు ఆగారు. వాస్తవానికి 1930 జనవరి 26న కాంగ్రెస్ పార్టీ జాతీయ సమావేశంలో తొలిసారిగా స్వరాజ్య తీర్మానం చేశారు. అప్పటి దాకా కేవలం రాజకీయ స్వాతంత్రం వస్తే చాలు, సంపూర్ణ అధికారం బ్రిటిష్ వారి చేతుల్లోనే ఉండి, దేశం సామంత రాజ్యంగా మిగిలిపోయినా ఫర్వాలేదనుకునేలా ఉన్న రాజకీయ నేతల వైఖరిని జలియన్‌ వాలా బాగ్ ఉదంతం ఒక్కసారిగా మార్చేసింది.

సుభాష్ చంద్రబోస్, జవహర్‌లాల్ నెహ్రూ లాంటి నేతలు కాంగ్రెస్ పార్టీలో వేడి పుట్టించి పూర్ణ స్వరాజ్య తీర్మానం ప్రకటన చేయించడంలో సఫలమయ్యారు. ఆ రోజునే స్వాతంత్ర్య దినోత్సవంగా పరిగణించాల్సిందని కాంగ్రెస్ పార్టీ దేశ ప్రజలకు పిలుపు కూడా ఇచ్చింది. అంతటి చారిత్రక ప్రాధాన్యం ఉన్న తేదీకి చిరస్థాయిలో ఒక గుర్తింపు లాంటిది కల్పించాలన్న సదుద్దేశంతో నవభారత నిర్మాతలు మరో రెండు నెలలు ఆగి 1950 జనవరి 26 నుంచి రాజ్యాంగాన్ని అమల్లోకి తెచ్చారు. రాజ్యాంగం అమలులోకి వచ్చాక తొలిసారిగా  డాక్టర్ బాబూ రాజేంద్ర ప్రసాద్ రాష్ట్రపతిగా బాధ్యతలు చేపట్టారు. ఈసారి మన దేశం 71వ గణతంత్ర వేడుకలు జరుపుకోబోతోంది.