పాపం 2.0 అసలేమైనట్టు..!

పాపం 2.0 అసలేమైనట్టు..!

శంకర్ దర్శకత్వంలో సినిమా అంటే ఉండే క్రేజ్ అంతా ఇంతా కాదు.  అందులో రజినీకాంత్, శంకర్ కాంబినేషన్ అంటే చెప్పాల్సిన అవసరం లేదు.  శివాజీ, రోబో సినిమాలు ఎలాంటి హిట్ అయ్యాయో చెప్పక్కరలేదు.  రోబో కు కొనసాగింపుగా 2.0 ను శంకర్ తీస్తున్న సంగతి  ప్రపంచానికి తెలిసిందే.  ఈ సినిమాకోసం లైకా ప్రొడక్షన్స్ సంస్థ రూ.200 కోట్లకు పైగా ఖర్చు చేసింది.  భారీ బడ్జెట్, భారీ గ్రాఫిక్స్ తో కూడుకున్న సినిమా కాబట్టి అనుకున్న సమయానికి రాలేకపోవడం సహజమే.  ఎంత ప్లానింగ్ పక్కాగా ఉన్నా.. గ్రాఫిక్స్ ఆలస్యం అవుతుంటాయి కాబట్టి పోస్ట్ ఫోన్ అవుతుంటుంది.  గతేడాది దీపావళికే సినిమా రిలీజ్ కావాల్సి ఉన్నా రిలీజ్ కాలేదు.  సంక్రాంతికి వస్తుంది అనుకున్నారు అప్పుడు లేదు.  ఫిబ్రవరిలో ప్రెస్ నోట్ రిలీజ్ చేసి ఏప్రిల్ లో సినిమా రిలీజ్ చేస్తామని చెప్పినా.. ఇంతవరకు అతీగతీ లేదు.  

సినిమా స్టార్ట్ చేసి మూడేళ్లయింది.  షూటింగ్ పూర్తయ్యి సంవత్సరం దాటింటి.  పెద్ద సినిమా, అందులోను రజినికాంత్, అక్షయ్ కుమార్ వంటి బడా హీరోలు నటించిన సినిమా.  విడుదలయ్యే వరకు నిత్యం వార్తల్లో ఉండాల్సిన సినిమా.. అసలు ఏమైందో ఏం జరుగుతుందనే విషయాలు బయటకు రావడం లేదంటే ఆశ్చర్యం వేస్తోంది. రాజమౌళి బాహుబలి 2 సినిమా కూడా 2016 లో రిలీజ్ చేయాలనీ అనుకున్నా.. ఆలస్యం జరిగి 2017 ఏప్రిల్ లో రిలీజ్ చేశారు.  కానీ, రిలీజ్ అయ్యే వరకు సినిమా వార్తల్లో ఉంది.  అదే సినిమాకు ప్లస్ అయింది.  రోబో 2.0 సంగతే ఎవరికి అంతుపట్టడం లేదు.  నిర్మాతలు కూడా ఈ సినిమా గురించి మాట్లాడకపోవడం విడ్డూరంగా ఉంది.  ఒక సినిమా పూర్తయ్యే వరకు మరో సినిమా జోలికి వెళ్లని శంకర్ ఇప్పుడు భారతీయుడు 2 స్క్రిప్ట్ పనుల్లో మునిగిపోయాడు.  రజినీకాంత్ చేతిలో ఉన్న సినిమాలు పూర్తి చేసి రాజకీయాల్లోకి వెళ్లేందుకు అడుగులు వేస్తున్నాడు.  మరోవైపు లైకా ప్రొడక్షన్ సంస్థ కూడా వేరే సినిమా బిజీలో ఉన్నారు.  2.0 సంగతి గురించి ఎవరు ఏమి మాట్లాడటం లేదు.  ఐపీఎల్ ఫైనల్ మ్యాచ్ రోజున రోబో 2.0 ట్రైలర్ రిలీజ్ చేస్తారనే టాక్ వచ్చినా.. దానిపై అధికారికంగా ఎవరు ప్రకటించలేదు.  అసలు రోబో 2.0 రిలీజ్ అవుతుందా లేదా అనే సందేహాలు వ్యక్తం అవుతున్నాయి.