గాంధీ ఆసుపత్రిలో అసలు ఏమి జరుగుతోంది ?

గాంధీ ఆసుపత్రిలో అసలు ఏమి జరుగుతోంది ?

గాంధీ ఆసుపత్రిలో వైద్యుల మధ్య అంతర్గత కుమ్ములాటలు మరోసారి బయట పడ్డాయి. తాజాగా డాక్టర్ వసంత్ సస్పెన్షన్ తరువాత అనేక అవినీతి, అక్రమాల విషయాలు బయటకురాగా మతిస్థిమితం లేకుండా ఓ వ్యక్తి ఆరోపణలు చేశారని... గాంధీ ఆస్పత్రిని అబాసుపాలు చేయాలని వసంత్ చూస్తున్నారంటున్నారు ఆసుపత్రి సూపరింటెండెంట్ శ్రవణ్. గాంధీ ఆసుపత్రిలో ఎలాంటి అక్రమాలు జరగలేదని ఎలాంటి విచారణకైనా తాము సిద్ధమేనని ఆసుపత్రి సూపరింటెండెంట్ శ్రవణ్ అంటున్నారు. కరోనాపై తప్పుడు ప్రచారం చేశారన్న ఆరోపణలతో సస్పెండయిన గాంధీ ఆస్పత్రి వైద్యుడు వసంత కుమార్ వ్యవహారం అనూహ్య మలుపులు తిరుగుతోంది.

గాంధీ ఆవరణలో రెండు రోజుల క్రితం ఆత్మహత్యాయత్నం చేసిన వసంత కుమార్ ఆస్పత్రి వ్యవహారాలపై తీవ్ర ఆరోపణలు చేస్తున్నారు. గాంధీ ఆస్పత్రిలో హౌస్ సర్జన్ సర్టిఫికెట్ల జారీలో భారీ కుంభకోణం జరిగిందని, ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ శ్రావణ్ కుమార్ పాత్ర ఇందులో ఉందని ఆయన ఆరోపించారు. ఎంబీబీఎస్ పూర్తయిన తర్వాత ఏడాదిపాటు హౌస్ సర్జన్ చేయాల్సిన జూనియర్ డాక్టర్లు హాస్పిటల్‌కు రాకుండానే డబ్బులిచ్చి సర్టిఫికెట్లు పొందుతున్నారని మండిపడ్డారు. డాక్టర్ శ్రావణ్ గాంధీలో గడిపే సమయం తక్కువని, సొంత ప్రాక్టీస్‌కే ఎక్కువ సమయం కేటాయిస్తారని ఆరోపించారు.

హౌస్ సర్జన్ల స్కామ్‌తో పాటు గాంధీ ఆస్పత్రిలో సెక్యూరిటీ, శానిటేషన్ వంటి అనేక స్కామ్‌లు జరుగుతున్నాయని ఆరోపించారు. వందమంది పనిచేస్తున్నట్టు రిజిస్టర్‌లో చూపించి 50 నుంచి 70 మంది మాత్రమే పనిచేస్తారని, జీతాలు మాత్రం వందమంది పేరుతో శాంక్షన్ అవుతుంటాయని తెలిపారు. తనపై వచ్చిన ఆరోపణలపై శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఆస్పత్రిలో అక్రమాలు ప్రశ్నిస్తున్నందుకే తనపై అసత్య ప్రచారం చేసి చర్యలు తీసుకున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.