మెగా శిబిరంలో ఏం జరుగుతోంది?

మెగా శిబిరంలో ఏం జరుగుతోంది?
ఒక్కొక్కరుగా మెగా హీరోలంతా ఫిల్మ్ ఛాంబర్ బాట పట్టారు... సినీ ఇండస్ట్రీలో, తనపై జరుగుతున్న కుట్రలపై న్యాయపోరాటానికి సిద్ధమవుతూ పవన్ స్టార్, జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఫిల్మ్ ఛాంబర్ చేరుకోగా... ఆ వెంటనే నాగబాబు, అల్లు అర్జున్, రాంచరణ్‌, వరుణ్‌తేజ్, శివాజీ రాజా, హేమ, వినాయక్, నరేశ్, పరుచూరి వెంకటేశ్వరరావు, మారుతి, మెహర్ రమేశ్, అల్లు అరవింద్‌తో పాటు పలువురు ప్రముఖులు ఫిల్మ్ చాంబర్‌కు చేరుకున్నారు. ఇక పవన్ కల్యాణ్ తన వెంట తల్లిని కూడా ఫిల్మ్ చాంబర్‌కు తీసుకొచ్చారు. మధ్యాహ్నం 2.30 తర్వాత మెగాస్టార్ చిరంజీవి కూడా ఇక్కడికి చేరుకునే అవకాశం ఉందంటున్నారు. ఈ పరిస్థితుల్లో వాళ్లు ఏం చేస్తారన్నది చర్చగా మారింది. వరుస ట్వీట్లతో పెద్ద చర్చకు తెరలేపిన పవన్ కల్యాణ్... ఆ వెంటనే ఫిల్మ్ ఛాంబర్‌కు వచ్చేశారు... అయితే చిరంజీవి వచ్చిన తర్వాత మెగా ఫ్యామిలీ ఏం చేయబోతోదంటూ సినీ పరిశ్రమ మొత్తం అటువైపే చూస్తోంది. క్యాస్టింగ్‌ కౌచ్‌ వ్యవహారం టాలీవుడ్‌ను ఇప్పటికే కుదిపేయగా... క్షమాపణల వరకు వచ్చింది. అయితే మెగా ఫ్యామిలీ మొత్తం రంగంలోకి దిగడంతో పరిస్థితి మొత్తం మారిపోయిందంటున్నారు విశ్లేషకులు... దీంతో ఇటు తెలంగాణ, అటు ఆంధ్రప్రదేశ్‌ ప్రజల దృష్టిమొత్తం ఫిల్మ్ ఛాంబర్ వైపే ఉందంటున్నారు. మరోవైపు ఫిల్మా ఛాంబర్‌లో అంతా నిరసనకు దిగే అవకాశం ఉందనే వార్తలు వస్తున్నాయి... అనంతరం చిరంజీవి, పవన్ కల్యాణ్‌ మీడియాతో మాట్లాడే అవకాశం ఉందంటున్నారు.