బుమ్రా ఐపీఎల్ లోనే ఆడుతాడా..?

బుమ్రా ఐపీఎల్ లోనే ఆడుతాడా..?

ప్రపంచ టాప్ బౌలర్లలో ఒకడు జస్ప్రీత్ బుమ్రా. అంతేకాదు యార్కర్ కింగ్, డెత్ ఓవర్ల స్పెషలిస్ట్ అని బుమ్రాకు బిరుదులు ఉన్నాయి. కెరీర్ ఆరంభం నుంచి బుమ్రా మంచి ఫామ్‌లో ఉన్నాడు. కెప్టెన్ బంతిని ఇచ్చిన ప్రతిసారి వికెట్లు తీసి.. తనపై ఉన్న నమ్మకాన్ని కాపాడుకున్నాడు. బ్యాట్స్‌మన్‌ ఎవరైనా బుమ్రా బంతికి బలవ్వాల్సిందే. ఐపీఎల్ 2020 లోనూ 27 వికెట్లతో చెలరేగిపోయాడు. అంతలా రెచ్చిపోయిన బూమ్.. బూమ్.. ఆసీస్ గడ్డపై మాత్రం తేలిపోతున్నాడు.

ప్రస్తుతం టీమిండియా ఆస్ట్రేలియాతో వన్డే సిరీస్ ఆడుతున్న విషయం తెలిసిందే. మూడు వన్డే సిరీస్‌లో భాగంగా జరిగిన రెండు మ్యాచ్‌లలో కోహ్లీసేన భారీ ఓటములను ఎదుర్కొంది. బుమ్రా పేలవమైన ప్రదర్శనపై ప్రతిఒక్కరు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే.. ఐపీఎల్ 2020లో ముంబై ఇండియన్స్ టైటిల్ గెలవడంతో కీలక పాత్ర పోషించాడు. 27 వికెట్లతో అద్భుత ప్రదర్శన చేశాడు. టాప్, మిడిల్, లోయర్ ఆర్డర్.. బ్యాట్స్‌మన్‌ ఎవరైనా బుమ్రా బంతికి బలయ్యారు. ఈ తరం ఉత్తమ ఫాస్ట్ బౌలర్లలో ఒకరిగా పరిగణించబడుతున్న బుమ్రా వన్డేల్లో అదే ఆటతీరును ప్రదర్శించడంలో విఫలమయ్యాడు. అయితే బుమ్రా ఎందుకు ఇలా విఫలమవుతున్నాడో యాజమాన్యం గుర్తించాల్సిన అవసరం ఉంది.