యూజర్ల దెబ్బ.. వెనక్కి తగ్గిన వాట్సాప్.. ఇప్పట్లో లేనట్టే..!

యూజర్ల దెబ్బ.. వెనక్కి తగ్గిన వాట్సాప్.. ఇప్పట్లో లేనట్టే..!

తక్కువ కాలంలోనే కోట్లాది మంది అభిమానాన్ని చురగొంది వాట్సాప్ యాప్... రోజుకో తరహాలో యూజర్ల అభిరుచులకు తగ్గట్టుగా అప్‌డేట్స్‌ వస్తుండడంతో.. క్రమంగా యూజటర్ల సంఖ్య పెరుగుతూ పోయింది. కానీ, కొత్త ప్రైవసీ విధానం ఇప్పుడు ఆ యాప్‌కు షాక్‌ ఇచ్చింది.. క్రమంగా వాట్సాప్‌కు బైబై చెప్పేవారి సంఖ్య పెరిగిపోతోంది.. కొత్త ప్రైవసీ పాలసీ ఫిబ్రవరి 8లోపు ఆమోదించకపోతే.. ఇక, వారికి వాట్సాప్ అందుబాటులో ఉండదని ఆ సంస్థ ప్రకటించింది. ఇదే సమయంలో ప్రైవసీ పాలసీపై అనేక అనుమానాలు తలెత్తడంతో.. ప్రత్యామ్నాయ యాప్‌ల వైపు మొగ్గుచూపుతున్నారు నెటిజన్లు.. ఆ సెగ వాట్సాప్‌కు గట్టిగానే తాకింది.. దీంతో కాస్త వెనక్కి తగ్గింది. అప్‌డేట్‌ అమలును కొద్ది రోజుల పాటు వాయిదా వేస్తున్నట్లు బ్లాగ్‌పోస్ట్‌లో ప్రకటించింది. వ్యక్తిగత సమాచార గోప్యతపై నెలకొన్న సందేహాల దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నట్టు ప్రకటించింది. 

తమ పాలసీపై వస్తున్న తప్పుడు వార్తలతో వినియోగదారుల్లో ఆందోళన నెలకొందని, ఈ మేరకు ప్రైవసీ పాలసీని వాయిదా వేస్తున్నట్టు ప్రకటించింది వాట్సాప్.. మొదట నిర్ణయించిన ప్రకారం ఫిబ్రవరి 8న కాకుండా.. పాలసీని మే 15వ తేదీ నుంచి అమలులోకి తీసుకురానున్నట్లు వెల్లడించింది. అంటే, కొత్త ప్రైవసీ పాలసీని ఆమోదించకపోయినా.. ఫిబ్రవరి 8న ఎవరి ఖాతాలు నిలిచిపోవు.. మే 15వ తేదీ వరకు కొనసాగుతాయన్న మాట. మరోవైపు తమ యాప్‌లో గోప్యత, భద్రత, పని విధానంపై వచ్చిన అపోహలను తొలగించే పనిలో పడిపోయారు నిర్వాహకులు.. దీనిపై తన యూజర్లకు వివరణ ఇస్తూ వస్తుంది. అసలు వివాదం మొదలైంది ఎక్కడనే విషయాన్ని పరిశీలిస్తే.. కొత్త ప్రైవ‌సీ పాల‌సీలో భాగంగా యూజ‌ర్ల డేటాను త‌న మాతృసంస్థ ఫేస్‌బుక్‌తో పంచుకుంటామ‌ని వాట్సాప్ ప్రకటించింది. అంటే ?  మీ నుంచి వాట్సాప్ ఆటోమేటిగ్గా సేక‌రించే డేటా మొత్తం ఫేస్‌బుక్‌కు వెళ్లిపోతుంది. ఇందులో మీ మొబైల్ నంబ‌ర్‌, వాట్సాప్ అకౌంట్ క్రియేట్ చేసుకునే స‌మ‌యంలో మీరు ఇచ్చే క‌నీస స‌మాచారం లాంటివి ఉంటాయి.. అంతేకాదు.. యూజ‌ర్ యాక్టివిటీ, వాట్సాప్ ఎంత త‌ర‌చుగా వాడుతున్నారు. వినియోగించే ఫీచ‌ర్లు, ప్రొఫైల్ ఫొటో, స్టేట‌స్‌, అబౌట్ స‌మాచారం అంతా వాట్సాప్ సేక‌రిస్తుంది. మీ డివైస్ నుంచి మీ క‌చ్చిత‌మైన లొకేష‌న్‌ను కూడా మీ అనుమ‌తితో తీసుకుంటుంది. ఈ స‌మ‌చారాన్నంతా ఫేస్‌బుక్‌, దాని ఇత‌ర ప్రోడ‌క్ట్స్ కూడా ఉప‌యోగించే అవ‌కాశం ఉండడంతో.. యూజర్లలో ఆందోళన మొదలైంది. ఫేస్‌బుక్‌తోపాటు మెసెంజ‌ర్‌, ఇన్‌స్టాగ్రామ్, ఫేస్‌బుక్ షాప్స్‌, స్పార్క్ ఏఆర్ స్టూడియో, ఆడియెన్స్ నెట్‌వ‌ర్క్‌లాంటివి కూడా ఉన్నాయి. ఈ కొత్త పాలసీతో యూజర్ల వ్యక్తి సమాచారంత పాటు, పేమెంట్స్, కాంటాక్ట్‌లు, లొకేష‌న్‌ లాంటి కీల‌క స‌మాచారాన్ని వాట్సాప్ సేకరించడమే కాకుండా.. త‌న మాతృసంస్థ ఫేస్‌బుక్‌కు అందించ‌నుంది. దీంతో యూజర్ల డేటా భద్రతపై ఆందోళనలు నెలకొని.. ప్రత్యామ్నాయాలను డౌన్‌లోడ్ చేస్తున్నారు. ఇది గమనించిన వాట్సాప్.. ఆ నిర్ణయాన్ని తాత్కాలికంగా వాయిదా వేసుకుంది.