బామ్మ కనిపించిన ఆనందంలో..

బామ్మ కనిపించిన ఆనందంలో..

ఒక్క ఫొటో వేయి మాటలతో సమానం అంటారు. ఇక్కడ కనిపిస్తున్న బామ్మ-మనవరాళ్ల ఫొటో కూడా అలాంటిదే. వారి కలయికలో ఎంత ప్రేమ ఉందో వర్షిస్తున్న వారి కళ్లే చెబుతాయి. సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతున్న ఈ ఫొటో మరుగున పడుతున్న మానవీయ విలువల్ని మరోసారి తెరమీదికి తెచ్చింది. 

అమ్మా.. బామ్మ ఎక్కడికెళ్లిందంటూ అడిగిన కూతురికి.. బంధువుల ఇంటికెళ్లిందని, ఇదిగో వస్తుంది, అదిగో వస్తుందంటూ ఆ పేరెంట్స్ అసలు విషయం దాటేస్తూ పోయారు. వాళ్లు చెప్పింది నిజమేననుకన్న ఆ అమ్మాయి.. రేపో, మాపో బామ్మ వస్తుందిలే అన్న భరోసాతో ప్రతిరోజూ క్రమం తప్పకుండా స్కూలుకెళ్తోంది. ఈలోగా స్కూలు నుంచి ఫీల్డ్ ట్రిప్ ప్రోగ్రామ్ ఫిక్సయింది. ఆ కార్యక్రమంలో భాగంగా పిల్లలంతా ఓ వృద్ధాశ్రమాన్ని సందర్శించారు. 

తోటి పిల్లలతో ఆడుతూ పాడుతూ ఫీల్డ్ ట్రిప్ ఎంజాయ్ మెంట్ లో ఉన్న ఈ పాప కూడా వృద్ధాశ్రమంలో ఉన్నవారిని పలకరిస్తూ తిరగసాగింది. ఇంతలో ఆ వృద్ధుల్లోనే బామ్మ కూడా ఉండడాన్ని ఊహించలేకపోయింది. అమ్మా-నాన్నేమో బంధువుల ఇంటికి వెళ్లిందని చెబితే బామ్మ ఇక్కడుండడం ఏంటన్న ప్రశ్నతో అసలు విషయం నిదానంగా అర్థమైంది. పేరెంట్స్ బామ్మనే కాక తనను కూడా మోసం చేశారని తెలుసుకుంది.  

ఎన్నో ఏళ్లు దూరమైన ఆత్మీయ బంధువుల్లా ఆ బామ్మ, మనవరాలు కన్నీళ్లు కారుస్తూ మాట్లాడుకుంటుంటే అక్కడున్న స్కూల్ స్టాఫ్, ఓల్డేజ్ హోం నిర్వాహకులు నివ్వెరపోయారు. ఈ న్యూస్ పాతదే అయినా.. మళ్లీ తాజాగా సోషల్ మీడియాలో విపరీతంగా చక్కర్లు కొడుతుండడం.. మానవీయతకు పాత-కొత్త ఉండవని చెబుతున్నట్టుంది.