రవిచంద్రన్ అశ్విన్ ఎక్కడ?

రవిచంద్రన్ అశ్విన్ ఎక్కడ?

టీమిండియా స్టార్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ ఎక్కడ? అని తమిళనాడు క్రికెట్ అసోసియేషన్ ప్రశ్నిస్తోంది. గురువారం విజయ్ హజారే ట్రోఫీలో గుజరాత్ జట్టు తమిళనాడుపై నాలుగు వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఈ మ్యాచ్ లో ఆఫ్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ ఆడలేదు. అయితే అశ్విన్ ఈ గేమ్ లో ఆడకపోవడానికి ఓ కారణం ఉంది. సౌతాంప్టన్ లో జరిగిన నాలుగో టెస్టులో స్పిన్నర్ అశ్విన్ గాయపడ్డాడు అని ఐదవ టెస్టులో టాస్ చేస్తున్నప్పుడు భారత కెప్టెన్ విరాట్ కోహ్లి తెలిపాడు.

ఇంగ్లాండ్ సిరీస్ అనంతరం గాయం గురించి తమిళనాడు క్రికెట్ అసోసియేషన్ కి అశ్విన్ ఎలాంటి సమాచారం ఇవ్వలేదు. అంతేకాదు తమిళనాడు జట్టు వైద్య సిబ్బందితో కూడా టచ్ లో లేడని తెలుస్తోంది. అయితే ఒక అధికారి మిర్రర్ అనే పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూ లో.. వోర్సెస్టర్షైర్ కోసం కౌంటీ క్రికెట్ ఆడుతున్నాడు కాబట్టి అతను విజయ్ హజారే ట్రోఫీలో ఆడట్లేదు అని తెలిపాడు.

మాములుగా గాయంతో ఉన్న ఆటగాడు క్రికెట్ ఆడటం సాధ్యం కాదు. గాయపడిన క్రీడాకారుడు వెంటనే చికిత్స కోసం నేషనల్ క్రికెట్ అకాడమీకి తన నివేదికను అందించాలి. కానీ అశ్విన్ అలా చేయలేదు. దానికి బదులుగా.. అతను సెప్టెంబర్ 17న దుబాయ్ లో ఒక 'చాట్ షో' కార్యక్రమంలో పాల్గొన్నాడు. ఈ కార్యక్రమంకు హాజరుకావడానికి అశ్విన్ బీసీసీఐ నుండి అనుమతి తీసుకుంది లేనిది అనే విషయంపై ఎలాంటి స్పష్టత లేదు. అయితే ఈ విషయంపై బోర్డు అశ్విన్ పై విచారణను ప్రారంభించిందని మరొక అధికారి తెలిపాడు.

అశ్విన్ పై మెయిల్ రూపంలో మరో ఆసక్తికర విషయం వెలుగులోకి వచ్చింది. 'అశ్విన్ చిన్న కండరాల ఒత్తిడితో బాధపడుతున్నాడు. అతను ప్రస్తుతం చెన్నైలో చికిత్స తీసుకుంటున్నాడు. రెండు రోజుల్లో తమిళనాడు క్రికెట్ అసోసియేషన్ కు రిపోర్ట్ చేస్తాడు' అని బీసీసీఐ కమ్యూనికేషన్ జట్టు సభ్యుడు మిర్రర్ కు తెలిపాడు. ఈ వార్తల నేపథ్యంలో ప్రస్తుతం రవిచంద్రన్ అశ్విన్ ఎక్కడ ఉన్నాడు అనేది మాత్రం తెలియట్లేదు. ఈ విషయంపై అశ్విన్ స్పందిస్తేనే స్పష్టత రానుంది.