విండీస్‌ టూర్‌కు వెళ్లేదెవరు..? రేసులో వీరే.. 

విండీస్‌ టూర్‌కు వెళ్లేదెవరు..? రేసులో వీరే.. 

వెస్టిండీస్‌ పర్యటనకు టీమిండియాను రేపు ఎంపిక చేయబోతున్నారు.  చీఫ్‌ సెలక్టర్‌ ఎమ్మెస్కే ప్రసాద్‌ నేతృత్వంలోని కమిటీ సమావేశమై మూడు వన్డేలు, మూడు టీ20లు, రెండు టెస్టుల్లో తలపడే ఆటగాళ్లను ఎంపిక చేస్తుంది. ఇంతవరకూ వరల్డ్‌కప్‌ను దృష్టిలో పెట్టుకుని జట్టును ఎంపిక చేసిన సెలెకర్లు.. ఇప్పుడు భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని ఆటగాళ్లకు అవకాశం ఇవ్వబోతున్నారని తెలుస్తోంది. ఈ నేపథ్యంలో అందరి దృష్టి ఈ ఎంపికపై పడింది. 

టీమిండియా రేసులో ప్రియాంక్‌ పాంచల్‌, అభిమన్యు ఈశ్వరన్‌, నవదీప్‌ సైనీ, రాహుల్‌ చహర్‌ వంటి ఆటగాళ్లతోపాటు మనీష్‌ పాండే, అక్షర్‌ పటేల్‌ వంటివారున్నారు. శ్రేయాస్‌ అయ్యర్‌, శుభమన్‌ గిల్‌కు ప్లేస్‌ దాదాపు ఖాయమని తెలుస్తోంది. కీలకమైన నంబర్‌ 4 స్థానంలో వీరిద్దరినీ పరీక్షించే అవకాశం ఉందని సమాచారం. వరల్డ్‌కప్‌ టీమ్‌లో అనూహ్యంగా చోటు దక్కించుకున్న మయాంక్‌ అగర్వాల్‌కు మరో అవకాశం ఖాయంగా కనిపిస్తోంది. 

ఈ పర్యటన నుంచి మహేంద్ర సింగ్‌ ధోనీ తప్పుకోవడంతో ప్రధాన కీపర్‌గా రిషభ్‌ పంత్‌కు ఛాన్స్ ఇవ్వనున్నారు సెలెక్టర్లు. బ్యాకప్‌ కీపర్‌గా సీనియర్‌ వృద్ధిమాన్‌ సాహాకు అవకాశం దక్కొచ్చని తెలుస్తోంది. భారత్‌-ఏ జట్టు తరఫున పరుగుల వరద పారిస్తున్న ఆంధ్రా ఆటగాడు కేఎస్‌ భరత్‌ను సెకెండ్‌ కీపర్‌గా ఎంపిక  చేసినా ఆశ్చర్యపోవక్కర్లేదు.