`మ‌హాభార‌తం 3డి`లో కృష్ణుడు ఎవ‌రంటే?

`మ‌హాభార‌తం 3డి`లో కృష్ణుడు ఎవ‌రంటే?

మిస్ట‌ర్ పెర్ఫెక్ట్ అమీర్‌ఖాన్ డ్రీమ్ ప్రాజెక్ట్ `మ‌హాభార‌తం 3డి` ప్రీప్రొడ‌క్ష‌న్ ప‌నులు సాగుతున్న సంగ‌తి తెలిసిందే. దాదాపు 10ఏళ్ల పాటు ఐదు భాగాలుగా ఈ చిత్రాన్ని తెర‌కెక్కించేందుకు అమీర్ స‌న్నాహాలు
చేస్తున్నారు. ఈ సినిమాకి రిల‌య‌న్స్ అంబానీ దాదాపు 1000 కోట్ల మేర పెట్టుబ‌డులు పెట్టేందుకు అమీర్‌ఖాన్‌తో ఓ ఒప్పందం చేసుకున్నార‌న్న ప్ర‌చారం సాగింది. అంతేకాదు.. ఈ సినిమాని అటు చైనా మార్కెట్లోనూ రిలీజ్ చేసేందుకు భారీ ప్ర‌ణాళిక సాగుతోంది. ఆ క్ర‌మంలోనే ఈ ప్రాజెక్టుపై అంత‌కంత‌కు భారీ అంచ‌నాలు పెరుగుతున్నాయి. ప్ర‌స్తుతం అమీర్ కీల‌క పాత్ర‌ధారుల ఎంపిక ప‌నిలో ఉన్నారు.

ఇదివ‌ర‌కూ ఈ చిత్రంలో దృత‌రాష్ట్రుని పాత్ర‌లో బిగ్‌బి అమితాబ్ బ‌చ్చ‌న్ న‌టిస్తే బావుంటుంద‌ని అమీర్ అభిప్రాయం వ్య‌క్తం చేశారు. తాను క‌ర్ణుడు లేదా కృష్ణుడు పాత్ర‌లో న‌టించే అవ‌కాశం ఉంద‌ని హింటిచ్చాడు. తాజా అప్‌డేట్ ప్ర‌కారం.. అమీర్‌ఖాన్ స్నేహితుడు స‌ల్మాన్ ఖాన్ ఈ సిరీస్‌లో కృష్ణుడు పాత్ర పోషిస్తే బావుంటుంద‌ని అమీర్ భావిస్తున్నార‌ట‌. స‌ల్మాన్ సైతం మ‌హాభార‌తం తీస్తే ఆ పాత్ర‌లో న‌టిస్తాన‌ని ఇదివ‌ర‌కూ అన‌డంతో అమీర్ ఆ పాత్ర‌కు త‌న‌నే అడ‌గాల‌ని భావిస్తున్నార‌ట‌. ఇక‌పోతే ఈ చిత్రంలో అమీర్ అర్జునుడిగా న‌టిస్తార‌ని ప్ర‌చార‌మ‌వుతోంది. అయితే క‌ర్ణుడి పాత్ర‌కు ఎవ‌రిని ఎంపిక చేశారు? అన్న‌ది తెలియాల్సి ఉందింకా.