సర్జికల్ స్ట్రైక్ 2: బాలాకోట్ ఎందుకు ఎంచుకున్నారు?

సర్జికల్ స్ట్రైక్ 2: బాలాకోట్ ఎందుకు ఎంచుకున్నారు?

జమ్ముకశ్మీర్ పుల్వామాలో జరిగిన ఉగ్రవాద దాడికి భారతీయ వాయుసేన మెరుపులా విరుచుకుపడి చేసిన సర్జికల్ స్ట్రైక్ 2తో ప్రతీకారం తీర్చుకుంది. పాకిస్థాన్ లోని జైషే మొహమ్మద్ అతిపెద్ద ఉగ్రవాద శిబిరాన్ని ఐఏఎఫ్ నేలమట్టం చేసింది. సుమారుగా 400 మంది ఉగ్రవాదులను మట్టిలో కలిపేసింది. బాలాకోట్‌ లోని జైషే ఉగ్రవాద శిబిరాన్ని టార్గెట్ చేసినట్టు భారత ప్రభుత్వం తరఫున విదేశాంగ కార్యదర్శి విజయ్ గోఖలే అధికారికంగా ప్రకటించారు. అయితే ఆయన ముజఫరాబాద్, చకోట్ శిబిరాలపై జరిపిన దాడుల గురించి ప్రస్తావించలేదు. కానీ విశ్వసనీయ వర్గాల ప్రకారం వాయుసేన ముజఫరాబాద్, బాలాకోట్, చకోట్ లలోని ఉగ్రవాద శిబిరాలను లక్ష్యంగా చేసుకొని జరిపిన దాడుల్లో సమూలంగా ధ్వంసం చేసింది.

అయితే కేవలం బాలాకోట్ నే ఎందుకు భారత ప్రభుత్వం ప్రధాన లక్ష్యంగా చేసుకొందని అందరి మదిలో మెదులుతున్న ప్రశ్న. ఎందుకంటే బాలాకోట్ లోనే జైషే మొహమ్మద్ అతిపెద్ద ఉగ్రవాద శిక్షణ శిబిరాన్ని నిర్వహిస్తోంది. అక్కడ ఉన్న దట్టమైన అడవుల్లో నివాస ప్రాంతాలకు దూరంగా ఈ శిక్షణ కేంద్రాలు ఏర్పాటు చేసింది. ఈ కేంద్రాలను పూర్తిస్థాయిలో నిర్మించింది. బాలాకోట్ గురించి భారత్ దగ్గర పక్కాగా ఇంటెలిజెన్స్ ఇన్ పుట్స్ ఉన్నాయి. ఈ సమాచారం ఆధారంగా భారత వాయుసేన మెరుపుదాడి చేసింది. ఈ దాడిలో ఐఏఎఫ్ 12 మిరాజ్ ఫైటర్ జెట్లను ఉపయోగించింది.

బాలాకోట్ టార్గెట్ ఎందుకు?
-పాకిస్థాన్ లో జైషే అతిపెద్ద ఉగ్రవాద శిక్షణ శిబిరం
-బాలాకోట్ క్యాంప్ ను యూసుఫ్ అజహర్ నడిపిస్తున్నాడు
-జైషే చీఫ్ మసూద్ అజహర్ బంధువు యూసుఫ్ అజహర్
-ఆత్మాహుతి దాడి గురించి ప్రభుత్వం దగ్గర పక్కా ఇంటెలిజెన్స్ రిపోర్ట్
-జనావాస ప్రాంతాలకు దూరంగా శిక్షణ శిబిరం
-పౌరులకు నష్టం కలగకుండా ప్రత్యేక శ్రద్ధ తీసుకొని సైనిక చర్య జరిపారు

ఇంటెలిజెన్స్ ఇన్ పుట్ ఆధారంగా చేసిన ఈ దాడి కౌంటర్ టెర్రర్ అటాక్ అని ప్రభుత్వ వర్గాలు చెప్పాయి. అక్కడ ఆత్మాహుతి బాంబర్లను తయారు చేస్తున్నట్టు తెలిసింది. ఇది సైనిక దాడి కాదని కేవలం తనను తాను రక్షించుకొనేందుకు చేసిన దాడి మాత్రమేనని భారత్  తెలిపింది.