రూ.7,600 కోట్లు ఇస్తామన్న జపాన్ కంపెనీకి నో చెప్పిన భారతీయుడు

రూ.7,600 కోట్లు ఇస్తామన్న జపాన్ కంపెనీకి నో చెప్పిన భారతీయుడు

నిధుల కోసం స్టార్టప్ కంపెనీలు వెతకని మార్గం ఉండదు. కానీ ఓలా సహ వ్యవస్థాపకుడు భవీష్ అగర్వాల్ తన కంపెనీకి ఫండింగ్ ఇస్తామని డబ్బు మూటలతో వచ్చిన జపాన్ బ్యాంకుకు నో చెప్పాడు. జపాన్ కంపెనీ సాఫ్ట్ బ్యాంక్ గ్రూప్ కార్ప్. ఓలాలో 1.1 బిలియన్ డాలర్లు(రూ.7,600 కోట్లు) పెట్టుబడి పెడతామని ఆఫర్ ఇచ్చింది. దీనిని భవీష్ తిరస్కరించాడు. కంపెనీపై తన నియంత్రణ కొనసాగించాలని భవీష్ భావిస్తున్నాడు. దీంతో అతను సాఫ్ట్ బ్యాంక్ రూ.7,600 కోట్లు తీసుకొనేందుకు నిరాకరించాడు. జపాన్ కి చెందిన సాఫ్ట్ బ్యాంక్ గ్రూప్ కార్ప్ నుంచి స్వతంత్రం పొందేందుకు భవీష్ ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలిసింది.

బ్లూమ్ బెర్గ్ వార్తా కథనం ప్రకారం జపాన్ వ్యాపారవేత్త, పెట్టుబడిదారుడు మసయోషి సోన్ సాఫ్ట్ బ్యాంక్ చీఫ్ గా ఉన్నారు. ఓలాను ప్రారంభించినపుడు సాఫ్ట్ బ్యాంక్ గ్రూప్ కూడా పెట్టుబడి పెట్టింది. ఆ తర్వాత సాఫ్ట్ బ్యాంక్ ఓలా ప్రత్యర్థి కంపెనీ అయిన ఊబర్ లో వాటా కొనుగోలు చేసింది. అప్పుడు ఓలా, ఊబర్ ల విలీనానికి సాఫ్ట్ బ్యాంక్ ఎన్నో ప్రయత్నాలు చేసింది. కానీ భవీష్ ఆ ప్రయత్నాలన్నిటినీ అడ్డుకున్నాడు. ఆ అనుభవంతో ఓలాలో సాఫ్ట్ బ్యాంక్ ప్రభావం ఎక్కువ కాకుండా ఉండేందుకే భవీష్ ఈ తాజా ఆఫర్ ను తిప్పికొట్టాడు. 

ఓలాలో తన వాటాను 40 శాతం కంటే ఎక్కువగా పెంచుకొనేందుకు సాఫ్ట్ బ్యాంక్ 1.1 బిలియన్ డాలర్లు కొత్తగా పెట్టుబడి పెట్టేందుకు ముందుకొచ్చింది. అదే జరిగితే తనను ఓలా నుంచి సాగనంపడం ఖాయమని భవీష్ అగర్వాల్ భావించారు. అయితే జపాన్ కంపెనీతో తమకెలాంటి గొడవలు లేవని భవీష్ స్పష్టం చేశారు.  

33 ఏళ్ల భవీష్ అగర్వాల్ తన ఇంజనీరింగ్ సహాధ్యాయి అంకిత్ భాటీతో కలిసి 2011లో ఏఎన్ఐ టెక్నాలజీస్ ప్రైవేట్ పేరిట ఓలా బ్రాండ్ ని స్థాపించారు. ప్రస్తుతం ఈ కంపెనీ దేశంలో 100కి పైగా నగరాల్లో సేవలందిస్తోంది. 1.3 మిలియన్ డ్రైవర్లులో ఓలాతో అటాచ్ అయ్యారు. గత ఏడాది ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, ఇంగ్లాండ్ లలో కూడా ఓలా సేవలు ప్రారంభించారు. భారత్ లో ఫుడ్ డెలివరీ వ్యాపారంలోకి కూడా ఓలా అడుగు పెట్టింది. ఊబర్ ఈట్స్ మార్కెట్ షేర్ లాగేసేందుకు ఓలా ముమ్మరంగా ప్రయత్నిస్తోంది.