ఆ రెండు దిల్ రాజును భయపెడుతున్నాయి..!!

ఆ రెండు దిల్ రాజును భయపెడుతున్నాయి..!!

టాలీవుడ్ లో అభిరుచి ఉన్న సినిమాలను నిర్మించే దర్శకుల్లో దిల్ రాజు ఒకరు.  కుటుంబకథా చిత్రాలకు దిల్ రాజు సంస్థ పెట్టింది పేరు.  మల్టీ టాలెంటెడ్ నిర్మాతగా దిల్ రాజుకు ఇండస్ట్రీలో పేరుంది.  గత కొంతకాలంగా దిల్ రాజు సినిమాలు బాక్సాఫీస్ వద్ద ఇబ్బందులు పడుతున్నాయి.  కాలా సినిమాను తెలుగులో రిలీజ్ చేసిన దిల్ రాజుకు లాభాలు రాకపోయినా నష్టాలు లేకుండా బయటపడ్డాడు.  తాజాగా దిల్ రాజు నిర్మాణ సంస్థ నుంచి వచ్చిన లవర్ సినిమా భారీ నష్టాలను మిగిల్చింది.  రూ. 8 కోట్లకు పైగా ఖర్చు పెట్టి తీసిన ఈ సినిమాకు.. ఖర్చులు కూడా రాలేదంటే అర్ధం చేసుకోవచ్చు.  

లవర్ పరాజయం పాలైనప్పటికీ దిల్ రాజు.. నితిన్ శ్రీనివాస కళ్యాణం సినిమాపై ఆశలు పెట్టుకున్నాడు.  అందుకు తగ్గట్టుగానే బజ్ క్రియేట్ అయింది.  సినిమా టీజర్, ట్రైలర్ ఆకట్టుకున్నాయి.  దీంతో ఈ సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ బాగానే జరిగినట్టుగా తెలుస్తుంది.  యూఎస్ లోను మంచి రేటుకే అమ్ముడుపోయింది.  ఆగష్టు 9 న ఈ సినిమా రిలీజ్ కాబోతున్నది.  అయితే, శ్రీనివాస కళ్యాణంకు రెండు సినిమాలు అడ్డంకులుగా మారబోతున్నాయి.  అందులో ఒకటి కమల్ హాసన్ విశ్వరూపం 2 కాగా, రెండోది విజయ్ దేవరకొండ గీతా గోవిందం.  

విశ్వరూపం 2 ను తమిళ, తెలుగు భాషల్లో ఒకేరోజున అంటే ఆగష్టు 10 వ తేదీన విడుదల చేస్తున్నారు.  కమల్ హాసన్ కు తెలుగులో కూడా మంచి పేరు ఉన్నది.  కమల్ హాసన్ నటించిన చాలా సినిమాలు తెలుగులో మంచి విజయాన్ని సొంతం చేసుకున్నాయి.  విశ్వరూపం 1 సినిమా కూడా తెలుగులో మంచి హిట్టైంది. ఆగష్టు 10 న విడుదల కాబోతున్న విశ్వరూపం 2 ప్రభావం శ్రీనివాస కళ్యాణంపై కొంతమేరకు ఉంటుంది అనడంలో సందేహం లేదు.  

మరోవైపు ఆగష్టు 15 న స్వతంత్ర దినోత్సవం సందర్భంగా విజయ్ దేవరకొండ గీతాగోవిందం రిలీజ్ అవుతున్నది.  ఇప్పటికే విడుదలైన టీజర్ యూత్ ను ఆకట్టుకోవడంతో సినిమాపై అంచనాలు ఏర్పడ్డాయి.  గీతా ఆర్ట్స్ నిర్మాణ సంస్థ నుంచి వస్తున్న సినిమా కావడంతో.. దీని ప్రభావం కూడా శ్రీనివాస కళ్యాణంపై ఉంటుంది.  లవర్ సినిమా నష్టాన్ని శ్రీనివాస కళ్యాణంతో పూడ్చుకోవాలని చూస్తున్న దిల్ రాజు ప్లాన్ కు విశ్వరూపం 2, గీతా గోవిందంలు అడ్డుతగిలేలా ఉన్నాయి.  మరి ఈ అడ్డంకులను తట్టుకొని నితిన్ శ్రీనివాస కళ్యాణం దిల్ రాజుకు లాభాలు తెచ్చిపెడతాడా లేదా అన్నది త్వరలోనే తెలుస్తుంది.