శంషాబాద్ ఘటనలో ఆమెకు 'దిశ' పేరు ఎందుకు పెట్టారో తెలుసా ?

శంషాబాద్ ఘటనలో ఆమెకు 'దిశ' పేరు ఎందుకు పెట్టారో తెలుసా ?


అత్యాచార కేసుల్లో బాధితురాలి పేరును కుటుంబ సభ్యుల అనుమతి లేకుండా ఎట్టి పరిస్థితుల్లో పోలీసులు గానీ, మీడియాగానీ వెల్లడించడానికి వీల్లేదు. ఆమె ఎవరో..? ఎక్కడ ఉంటున్నారో? ఏం చేస్తున్నారో? వంటి వివరాలతో పాటు ఆమె కుటుంబ సభ్యుల వివరాలను కూడా బహిర్గతం చేయడానికి వీల్లేదు. ఈ నిబంధనలను ఉల్లంఘిస్తే ఐపీసీలోని సెక్షన్‌ 228-ఏ ప్రకారం రెండేళ్ల వరకు జైలు శిక్ష పడే అవకాశం ఉంది. లైంగిక దాడులు చేసిన నేరస్థులకంటే బాధితులను నీచంగా చూస్తోంది మన సమాజం. అందువల్లే బాధితుల వివరాలు బహిర్గతం కాకుండా మరో పేరుతో వాళ్లను ప్రస్తావించే సంప్రదాయం కొనసాగుతోంది.

అందుకే బాధితురాలికి అప్పటికప్పుడు దిశ అనే పేరు పెట్టారు సైబరాబాద్‌ పోలీస్‌ కమిషనర్‌ సజ్జనార్‌. అలాగే, బాధితురాలి తల్లిదండ్రులు, కుటుంబ సభ్యుల వివరాలను గోప్యంగా ఉంచాలని కోరారు సీపీ. ఇంతకీ దిశకు ఆ పేరు ఎందుకొచ్చింది..? దేశ రాజధానిలో 2012 డిసెంబర్‌లో నిర్భయ ఘటన జరిగింది. కదులుతున్న బస్సులో అఘాయిత్యానికి పాల్పడ్డారు దుండగులు... తర్వాత ఆమెను వాహనం నుంచి బయటకు నెట్టి పరారయ్యారు.

ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన బాధితురాలు మృత్యువుతో పోరాడి చివరికి ప్రాణాలు విడిచింది. అత్యాచార ఘటనల్లో బాధితులు, వారి బంధువుల వివరాలు గోప్యంగా ఉంచాలన్న సుప్రీం కోర్టు ఆదేశాలతో ఆమెకు నిర్భయగా పేరు పెట్టారు. ఇటువంటి సంఘటనలు పునరావృత్తం కాకూడదనే ఉద్దేశంతో శిక్షలను కఠినతరం చేస్తూ... నిర్భయ చట్టం చేసింది ప్రభుత్వం. దిశ అంటే దిక్కు... దిశ అంటే లక్ష్యం... దిశ అంటే గురి... మార్గం... అనే అర్థాలు కూడా ఉన్నాయి. చట్టాలు చేస్తే చాలదని... వాటిని పటిష్టంగా అమలు చేయాలని చెప్పకనే చెప్పింది దిశ ఘటన.