జగన్ ఆయన్ని లైట్ తీసుకున్నారా ?

జగన్ ఆయన్ని లైట్ తీసుకున్నారా ?

ఒకప్పుడు ఆ జిల్లాలో ఆయన మాటే శాసనం... ఆయన చెప్పిందే వేదం! ఇప్పుడు సీన్‌ రివర్స్‌ అయ్యింది! శిష్యులు.. సమకాలికులు పదవులు ఎంజాయ్‌ చేస్తుంటే.. పాపం ఆయన మాత్రం ఉనికి చాటుకునే  ప్రయత్నం చేస్తున్నారు! YS కుటుంబానికి ఆత్మీయుడిగా.. ఆంతరంగికుడిగా పేరున్న ఆయన.. ఇప్పుడు ఆ కుటుంబానికే ఎందుకు దూరమయ్యారా? అంతటి ప్రాధాన్యం ఉన్న నాయకుడికి.. ఇంతటి అప్రాధాన్యం ఎందుకు?

అభిమానుల ఊహలు తలకిందులు

వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత.. మంత్రివర్గం విస్తరణకు ముందే రాజకీయ సన్యాసం ప్రకటించేశారు భూమన కరుణాకర్‌రెడ్డి.  ఇవే తనకు చివరి ఎన్నికలు అని.. ఇకపై పోటీ చేసేది లేదంటూ అభిమానుల సమక్షంలో ప్రకటించారాయన. దీంతో వైసీపీ అధికారంలోకి వస్తే రిటైర్‌ అవుతానన్న భూమన కరుణాకర్‌రెడ్డికి  మంత్రి పదవి ఖాయమని ఆశపడ్డారు అభిమానులు. రాష్ట్రంలో తిరుపతికి ప్రాధాన్యం ఉండటం.. సీఎం జగన్‌కు దగ్గరి వ్యక్తి కావడంతో కరుణాక్‌రెడ్డికి తిరుగే లేదని అంతా అనుకున్నారు. అయితే అభిమానుల ఊహలు తలకిందులు అయ్యాయి. చిత్తూరు జిల్లా నుంచి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి, మంత్రి పదవి రేసులో ఉన్నట్లు ప్రచారంలోనే లేని నారాయణస్వామికి కేబినెట్‌లో బెర్త్‌లు దక్కాయి. పెద్దిరెడ్డికి ప్రాధాన్యం కలిగిన శాఖ దక్కగా.. నారాయణస్వామి ఏకంగా ఉప ముఖ్యమంత్రి అయ్యారు.

భూమనకు తప్ప అందరికీ మర్యాదలు

మంత్రి పదవి ఎలాగూ దక్కని భూమన.. టీటీడీ పాలకమండలి చైర్మన్‌ అవుతారని అనుకున్నారు అనుచరులు. కానీ.. టీటీడీ చైర్మన్‌ గిరిని జగన్‌ బాబాయి వైవీ సుబ్బారెడ్డి ఎగరేసుకుని పోయారు. భూమన రాముడైతే.. తాను హనుమంతుడునని చెప్పుకొన్న చెవిరెడ్డి భాస్కరరెడ్డికి మాత్రం పార్టీలో... ప్రభుత్వంలో మంచి గౌరవమే లభించింది. గువుకు ఒక్క పదవీ లేకపోగా చెవిరెడ్డి ఏకంగా మూడు పదవులు ఎంజాయ్‌ చేస్తున్నారు. భూమన పదవి కోసం ఎదురు చూస్తుంటే.. చెవిరెడ్డి ప్రభుత్వ విప్‌ అయ్యారు. భూమనకు సంబంధం లేకుండానే .. భూమన నియోజకవర్గంలో భాగమైన తుడాకు చైర్మన్‌ అయ్యారు చెవిరెడ్డి. టీటీడీ చైర్మన్‌ పదవిని భూమన ఆశిస్తే.. చెవిరెడ్డి టీటీడీ పాలకమండలి ఎక్స్‌ అఫీషియో సభ్యుడయ్యారు. భూమన కరుణాకర్‌రెడ్డి స్వయంగా పార్టీలోకి తీసుకొచ్చిన రోజాకు కేబినెట్‌ హోదా కలిగిన APIIC చైర్మన్‌ పదవి దక్కింది. ఇలా అన్నకు తప్ప.. అందరికీ మర్యాదలు దక్కుతుండటంతో భూమన అభిమానులు నీరశించిపోయాట. 

ఇంకా ఊహల్లో భూమన శిబిరం

చివరికి భూమన కరుణాకర్‌రెడ్డికి టీటీడీ పాలకమండలిలో ప్రత్యేక ఆహ్వానితుల కోటాలో లభించిన సభ్యత్వంతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. గతంలో టీటీడీ పాలకమండలి సభ్యుడిగా.. టీటీడీ చైర్మన్‌గా బాధ్యతలు నిర్వహించిన భూమన.. ఇప్పుడు దక్కిన పదవినే అపూరూపంగా భావించాల్సిన పరిస్థితి వచ్చింది. తన పక్క నియోజకవర్గ  ఎమ్మెల్యేలు.. తనకు ఎంతో జూనియర్లు అయిన ఎమ్మెల్యేలకు పదవుల మీద పదవులు దక్కుతున్నా.. భూమనకు మాత్రం ఎందుకీ పరిస్థితి అని  అభిమానులు తమలో తామే ప్రశ్నించుకుంటున్నారట. అయితే భూమన శిబిరం ఇంకా ఊహల్లోనే ఉందనే  ప్రచారం జరుగుతోంది.  ఒకవేళ వైవీ సుబ్బారెడ్డి రాజ్యసభకు వెళ్తే.. టీటీడీ చైర్మన్‌ పదవిని అన్నకే కట్టబెడతారనే ఊహల్లో ఉన్నారు అభిమానులు.

కుటుంబానికే దూరం!

వాస్తవానికి YS హయాంలో  జిల్లాని శాసించిన నేత ఎవరైనా ఉన్నారంటే అది భూమన కరుణాకర్‌రెడ్డే. విద్యార్ధి నాయకుడిగా ఉన్నప్పటి నుంచే వైఎస్‌ఆర్‌ తండ్రి రాజారెడ్డితో భూమనకు అనుబంధం ఉంది. అది వైఎస్‌తోనూ కొనసాగింది. జగన్‌ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు రాష్ట్ర నేతగా ఎదిగారు కరుణాకర్‌రెడ్డి. వైఎస్‌ కుటుంబానికి ఆత్మీయుడిగా పేరుగాంచిన వ్యక్తి.. ఇప్పుడు ఆ కుటుంబానికే దూరమైపోయారనే టాక్‌ నడుస్తోంది. ఎమ్మెల్యే తప్ప.. ఎలాంటి అధికార పదవి.. హోదా లేకుండా జీరో అయిపోయారనే విమర్శలు వినిపిస్తున్నాయట.