బీజేపీకి ఎందుకు రాజీనామా చేశానంటే..

బీజేపీకి ఎందుకు రాజీనామా చేశానంటే..

 

జాతి ప్రయోజనాలను బీజేపీ దెబ్బ తీస్తోందని, దేశంలో దిగజారుడు రాజకీయాలకు ఆజ్యం పోస్తోందని ఆ పార్టీ ఎన్నికల ప్రచార వ్యూహకర్త శివమ్‌శంకర్‌సింగ్‌ అన్నారు. ఎన్నో ఏళ్లు నుంచి ఆ పార్టీ తరఫున పని చేస్తున్న సింగ్‌.. రామ్‌మాధవ్‌ బృందంలో కీలక సభ్యుడిగా ఉన్నారు. ఇకపై ఆ పార్టీలో తాను ఇమడలేనని పేర్కొంటూ రాజీనామా చేశారు. రాజీనామా చేస్తున్నది వివరించారు. ఉద్దేశపూర్వకంగానే కొన్ని ఫేక్‌ వార్తలను ప్రజల్లోకి బీజేపీ పంపించిందని ఆరోపించారు. తాను పార్టీకి దూరమవడానికి అనేక ఇదే ప్రధాన కారణమని శివంశంకర్‌ చెప్పారు. ఐతే.. ఏ రాజకీయ పార్టీ కూడా పూర్తిగా చెడ్డది కాదని.. అలా అంతా మంచిదని చెప్పలేమని అన్నారు. 2013లో మోడీ ఓ ఆశాకిరణంలా కనిపించినందునే తాను మద్దతిచ్చానని చెప్పారు. 

బీజేపీ హయాంలో సీబీఐ, ఈడీ వంటి దర్యాప్తు సంస్థలను రాజకీయ అవసరాలకు వినియోగించుకున్నారని సింగ్‌ ఆరోపించారు. మోడీ, అమిత్‌ షా కు వ్యతిరేకంగా మాట్లాడితే దాడులు ఖాయం అన్న పరిస్థితి తెచ్చారని, ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేయడానికి ఇంతకంటే ఏం కావాలని ప్రశ్నించారు. జస్టిస్‌ లోయా మృతి కేసు, సొహ్రాబుద్దీన్‌ కేసుతోపాటు ఉన్నావ్‌ కేసు దర్యాప్తుల్లో ఈ ప్రభుత్వం విఫలమైందని సింగ్‌ అన్నారు. నోట్ల రద్దుతో దేశ ఆర్థిక వ్యవస్థ అతలాకుతలమైందని, జీఎస్టీ అమలు అనాలోచిత చర్యల అని ఆయన అభిప్రాయపడ్డారు. ఈ వ్యవహారాల్లో ఓటమిని అంగీకరించే ధైర్యం బీజేపీకి లేదని విమర్శించారు. 

ప్రపంచ దేశాలకు గతంలో భారత్‌ అంటే ఏమాత్రం గౌరవం లేదని, తామొచ్చాక పరిస్థితి మారిందని మోడీ చెబుతుంటారని, కానీ ఇందులో ఏమాత్రం నిజం లేదని ఆయన అన్నారు. ఆ మాటకొస్తే.. గౌరవం తగ్గిందని అభిప్రాయపడ్డారు. పథకాల అమలులో బీజేపీ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని అన్నారు. చమురు ధరలు ఆకాశాన్నంటాయని, ఆరోగ్యం, విద్య అందరికీ అందనవిగానే ఇప్పటికీ మిగిలిపోయాయని సింగ్‌ అన్నారు. 
ఐతే.. బీజేపీ హాయాంలో రోడ్ల నిర్మాణం వేగవంతమైందని, మారుమూల గ్రామాలకు సైతం విద్యుత్‌ సౌకర్యం కల్పించారని, పై స్థాయిలో అవినీతి శాతం తగ్గిందని సింగ్‌ అభిప్రాయపడ్డారు. గతంలో కంటే లా అండ్‌ ఆర్డర్‌ స్థితి మెరుగుపడిందన్నారు. 
మోడీ అధికారం చేపట్టాక మీడియాకు విలువ లేకుండా పోయిందని, బీజేపీని విమర్శించే జర్నలిస్టులపై కాంగ్రెస్‌ అనుకూల ముద్ర వేస్తున్నారని ఆరోపించారు. గోరంత చేసి కొండంత ప్రచారం చేసుకోవడం ఈ ప్రభుత్వం స్టైల్ అని విమర్శించారు. ప్రచారాలకే వేలాది కోట్లు ఖర్చుబెట్టడం సరికాదని అన్నారు. ఈ 70 ఏళ్లలో దేశం ఏ మాత్రం ముందుకెళ్లలేదన్న బీజేపీ విమర్శల్లో ఏమాత్రం లాజిక్‌ లేదని సింగ్‌ అన్నారు. బీజేపీ ప్రోద్బలంతో నకిలీ వార్తలు పుట్టుకొస్తున్నాయని, ఇవి సమాజానికి తీవ్ర నష్టం కలిగిస్తున్నాయని చెప్పారు. 
 'హిందూ మతాన్ని కాపాడడానికి మేమే దిక్కు' అనేలా ప్రచారం చేసుకుంటున్నారని, కానీ ఏ ప్రభుత్వం వచ్చినా హిందువుల అభ్యున్నతిలో మార్పు లేదని సింగ్‌ అభిప్రాయపడడ్డారు. బీజేపీ నేతలు నడిపే టీవీ ఛానెళ్లలో జాతి, మత విద్వేషాలు రెచ్చగొట్టేలా డిబేట్లు నడిపి ప్రభుత్వ అనాలోచిన నిర్ణయాల నుంచి ప్రజలను పక్కదారి పట్టిస్తున్నారని ఆరోపించారు.