తమ భర్తలు మోడీతో భేటీ అయితే వాళ్లకి భయం

తమ భర్తలు మోడీతో భేటీ అయితే వాళ్లకి భయం

లోక్ సభ ఎన్నికల్లో చివరిదైన ఏడో దశ ఓటింగ్ కి ముందు నేతల ఆరోపణలు, ప్రత్యారోపణలు హద్దులు దాటుతున్నాయి. వివాదాస్పద వ్యాఖ్యలు ప్రతిరోజూ వార్తల్లో ముఖ్యాంశాలుగా మారుతున్నాయి. లోక్ సభ ఎన్నికల సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, బీఎస్పీ అధినేత్రి మాయావతి ఒకరిపై మరొకరు విమర్శల దాడి చేసుకుంటూ ఎన్నికల వేడి పెంచుతున్నారు. తాజాగా మాయావతి ప్రధాని మోడీపై అత్యంత వివాదాస్పదమైన వ్యాఖ్య చేశారు. 

బీజేపీ మహిళా నేతలు, బీజేపీ నేతల భార్యలు తమ భర్తలు మోడీతో భేటీ అవుతారంటేనే భయపడి పోతున్నారని మాయావతి విమర్శించారు. మోడీ మాదిరిగానే తమ భర్తలు కూడా తమను వదిలేస్తారేమోనని వాళ్ల భయమని బెహన్జీ ఎద్దేవా చేశారు. కేవలం తన రాజకీయ భవిష్యత్తు కోసమే మోడీ తన భార్యను వదిలేశారని ఆమె ఆరోపించారు.బీజేపీ నేతలు మహిళలకు గౌరవం ఇవ్వరని బీఎస్పీ చీఫ్ అన్నారు. రాజకీయ స్వార్థం కోసం ప్రధాని మోడీ తన భార్యను వదిలేశారని విమర్శించారు. రాజకీయ ప్రయోజనాల కోసం భార్యనే వదిలేసిన వ్యక్తి, దేశంలోని తల్లులు, తోబుట్టువులకేం న్యాయం చేస్తాడని ప్రశ్నించారు.  ప్రధాని మోడీ భార్యను మాయవతి రాజకీయాల్లోకి లాగడం పెనుదుమారం రేపుతోంది.