రాజకీయాల విషయంలో రజనీ యూ టర్న్.. అసలు విషయం ఏంటి ?

రాజకీయాల విషయంలో రజనీ యూ టర్న్.. అసలు విషయం ఏంటి ?

దక్షిణాది సూపర్ స్టార్ రజినీకాంత్ అనూహ్యంగా రాజకీయాలకు గుడ్‌ బై చెప్పారు. పూర్తి స్థాయిలో రాజకీయాల్లోకి ప్రవేశించబోతోన్నట్లు కొద్ది రోజుల కిందటే ప్రకటించిన ఆయన ఎవరూ ఊహించని విధంగా యూటర్న్ తీసుకున్నారు. రాజకీయాల నుంచి తప్పుకొంటున్నట్లు వెల్లడించారు. ఆరోగ్యం సహకరించట్లేదనే కారణంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పడంతో తలైవా పొలిటికల్‌ ఎంట్రీ ఎండ్ అయ్యింది. నిజానికి ఆయన పొలిటికల్ ఎంట్రీ హడావుడి ఇప్పటిది కాదు, 1996 నుండి రజనీకాంత్ రాజకీయాల్లో వస్తారని ప్రచారం జరుగుతుంది ..అప్పటి నుండి చాలా రజనీ పొలిటికల్‌ ఎంట్రీ వార్తలు వస్తున్నాఅవన్నీ వార్తలుగానే మిగిలాయి. మూడేళ్ల క్రితం రాజకీయాల్లోకి వస్తున్నట్లు స్వయంగా కబాలి హడావుడి చేశారు. తన పొలిటికల్ ఎంట్రీపై ప్రకటన చేసి మూడేళ్లు గడిచినా ఇప్పటి వరకు ప్రత్యక్ష రాజకీయాల్లో అడుగు పెట్టనేలేదు.

తమిళ రాజకీయాలు తెరపైకి వచ్చిన ప్రతీ సందర్భంలోనూ సూపర్ స్టార్ రజనీకాంత్ పొలిటికల్ ఎంట్రీ పక్కా అంటూ ప్రచారం జరిగింది. అయినా ఇప్పటి వరకు కార్యరూపం దాల్చలేదు.పొలిటికల్‌ ఎంట్రీపై ముహుర్తం సైతం ఖరారు చేయలేదు. ఆయన తన పొలిటికల్‌ ఎంట్రీపై నాన్చూతూనే ఉన్నారు. అయితే సూపర్‌స్టార్‌  రజనీకాంత్ రాజకీయ రంగప్రవేశంపై ఎట్టకేలకు సస్పెన్స్‌ వీడింది. జనవరిలో కొత్త పార్టీ పెట్టనున్నట్లు తలైవా ప్రకటన చేశారు. ఇందుకు సంబంధించిన వివరాలు డిసెంబరు 31న వెల్లడిస్తానని ట్విటర్‌ వేదికగా స్పష్టం చేశారు. రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేస్తామని, గెలుపు తమదేనని ధీమా వ్యక్తం చేశారు. తమిళనాడును సమూలంగా మారుస్తామని పేర్కొన్నారు. తనకు మద్దతుగా నిలుస్తున్న వారందరికీ ఈ సందర్భంగా కృత‍జ్ఞతలు తెలిపారు. దీంతో తమకు అదిరిపోయే న్యూ ఇయర్‌ గిఫ్ట్‌ ఇచ్చారంటూ తలైవా అభిమానులు హర్షం వ్యక్తం చేశారు.

అయితే తాజా పరిణామాలతో రజినీకాంత్ అభిమానులకు ఊహించని షాక్ ఇచ్చారు. ఇప్పట్లో పార్టీ ప్రకటన ఉండదని స్పష్టం చేశారు. ఈ మేరకు రజినీకాంత్ ట్వీట్ చేశారు. తనకు ఆరోగ్యం సహకరించడం లేదని తెలిపారు. రాజకీయాల్లో ప్రవేశంపై మూడు పేజీల ప్రకటన విడుదల చేశారు. తాను తీసుకున్న ఈ నిర్ణయం తన అభిమానులతోపాటు ప్రజలకు నిరాశ కలిగిస్తుందనే విషయం తనకు తెలుసన్న రజినీకాంత్.. ఈ విషయంలో అభిమానులు తనను క్షమించాలని వారిని కోరారు.రాజకీయాల్లోకి రాకుండానే ప్రజలకు సేవ చేస్తానని ఆయన అన్నారు. తన అనారోగ్యం కారణంగా తాను నటిస్తున్న అన్నాత్తై సినిమా షూటింగ్ ఆగిపోయిందని.. ఈ కారణంగా చాలామంది తమ ఉపాధి కోల్పోయారని రజినీకాంత్ అన్నారు. ఒకవేళ తాను రాజకీయ పార్టీ ఏర్పాటు చేస్తే పెద్ద ఎత్తున ప్రజలను కలవాల్సి ఉంటుందన్న రజినీకాంత్.. ఒకవేళ తనకు ఏమైనా జరిగితే తనను నమ్మకున్న వాళ్లు ఆర్థికంగా నష్టపోవడంతో పాటు మానసిక ప్రశాంతత కోల్పోతారని అన్నారు.

త్వరలోలో కొత్త రాజకీయ పార్టీని ఏర్పాటు చేస్తానని కొద్దివారాల క్రితం ప్రకటించిన రజినీకాంత్.. అందుకు సంబంధించిన పూర్తి వివరాలను ఈ నె 31న ప్రకటిస్తానని వెల్లడించి తమిళనాడు రాజకీయాల్లో ఆసక్తి పెంచారు. అయితే అంతకుముందే తాను ఒప్పుకున్న అన్నాత్తై సినిమా షూటింగ్‌ను పూర్తి చేయాలని భావించిన సూపర్ స్టార్.. అందుకోసం హైదరాబాద్ వచ్చారు. అయితే ఈ సినిమా షూటింగ్ సందర్భంగా కొందరికీ కరోనా అని నిర్ధారణ కావడంతో షూటింగ్ నిలిచిపోయింది. ఇక ఈ నెల 25న రజినీకాంత్‌కు ఉన్నట్టుండి బీపీ పెరగడంతో ఆయనను హైదరాబాద్‌లోని అపోలో ఆస్పత్రిలో చేర్చారు. దీంతో రజనీకాంత్ అభిమానుల్లో ఆయన ఆరోగ్యం గురించి టెన్షన్ మొదలైంది. 

రెండు రోజుల చికిత్స అనంతరం ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయిన రజినీకాంత్.. చెన్నై చేరుకున్నారు.అయితే చెన్నై చేరుకున్న వెంటనే తన పొలిటికల్ ఎంట్రీకి సంబంధించి కుటుంబసభ్యులతో ఆయన చర్చలు జరిపినట్టు తెలుస్తోంది. ఆరోగ్య పరిస్థితి సహకరించకపోవడంతో... రాజకీయ పార్టీ ఏర్పాటు వద్దని కుటుంబసభ్యులు ఆయనకు సూచించినట్టు సమాచారం. రాజకీయాల్లోకి అడుగుపెడితే.. ఆరోగ్యపరంగా, మానసికంగా అనేక సమస్యలు తలెత్తుతాయని కొందరు సన్నిహితులు రజనీకాంత్‌కు సలహా ఇచ్చారని తెలుస్తోంది. అందరి అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకున్న రజినీకాంత్.. కొత్త పార్టీ ఏర్పాటు ఇప్పట్లో వద్దని నిర్ణయం తీసుకున్నారు.

అయితే దీని వెనుక కొన్ని పార్టీల ఒత్తిడి  ఉందనే వాదన కూడా అప్పుడే సోషల్ మీడియాలో మొదలయింది. రజనీ ఎంట్రీవలన నష్టపోయే పార్టీల వారు ఆయన మీద ఒత్తిడి తీసుకు వచ్చి ఈ ప్రకటనని ఆపివేయించారు అంటూ కామెంట్లు చేస్తున్నారు. కానీ రాజనీ లాంటి స్టార్ హీరోని ఒక పార్టీ లేదా ఒక వ్యక్తీ ఒత్తిడి తెచ్చి పని చేయించుకోవడం అనేది జరగని పని. సో ఇవన్నీ పని లేక చేసేవారి కామెంట్స్ గానే భావించవలసి ఉంటుంది.