రాజకీయ చాణక్యుడు డిగ్గీ రాజాతో సాధ్వీ ప్రజ్ఞా ఢీ, గెలుపెవరిది?

రాజకీయ చాణక్యుడు డిగ్గీ రాజాతో సాధ్వీ ప్రజ్ఞా ఢీ, గెలుపెవరిది?

మధ్యప్రదేశ్ లోని హై-ప్రొఫైల్ సీట్ భోపాల్ లో కాంగ్రెస్ సీనియర్ నేత దిగ్విజయ్ సింగ్ ను ఢీ కొట్టేందుకు బీజేపీ సాధ్వీ ప్రజ్ఞా సింగ్ ఠాకూర్ ను ఎన్నికల బరిలో దించింది. సాధ్వీ ప్రజ్ఞ అభ్యర్థిత్వంపై జాతీయ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు అంగీకారం కుదిరిన తర్వాత నిర్ణయించారు. బుధవారం ఉదయం సాధ్వీ ప్రజ్ఞా భోపాల్ లోని రాష్ట్ర బీజేపీ కార్యాలయానికి వచ్చారు. దిగ్విజయ్ పేరు ప్రకటించిన తర్వాత నుంచే బీజేపీ తన అభ్యర్థి వేట ప్రారంభించింది. మాజీ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్, ఉమా భారతి, ఆలోక్ సంజర్, ఆలోక్ శర్మ, వీడీ శర్మ, అనేక ఇతర పేర్లు ముందుకొచ్చాయి. కానీ చివరి నిమిషంలో సాధ్వీ పేరు ముందుకొచ్చింది. రెండు రోజుల్లో మారిన పరిణామ క్రమంలో సాధ్వీకి బీజేపీ సభ్యత్వం ఇస్తూ స్వాగతం పలికారు. ఆమెను అభ్యర్థిగా ప్రకటించారు. నిజానికి ఆమె పేరు దిగ్విజయ్ పేరు ప్రకటించిన తర్వాత చర్చల్లో నిలిచింది. ఇప్పుడు వీళ్లిద్దరి మధ్య ఆసక్తికర పోటీకి తెర లేచినట్టయింది.

సాధ్వీ ప్రజ్ఞా కరడుగట్టిన హిందూత్వవాదిగా గుర్తింపు పొందారు. ఆమె దిగ్విజయ్ తన శత్రువని బహిరంగంగానే చెబుతారు. డిగ్గీ రాజాపై ఆమె ఆరోపణలు చేయగానే దానిని ప్రజల్లో విస్తృతంగా ప్రచారం చేసే వ్యూహాన్ని బీజేపీ అమలు చేయనుంది. బీజేపీ నేతలంతా దిగ్విజయ్ సింగ్ ను హిందూ వ్యతిరేకిగా పేర్కొంటారు. అలాంటపుడు ఆయనపై కరడుగట్టిన హిందూవాది ముద్ర ఉన్న నేత సాధ్వీ ఎన్నికల బరిలోకి దిగితే ఓట్ల ధ్రువీకరణ జరిగే అవకాశాలు ఉన్నాయి. 2008లో మాలేగావ్ పేలుళ్ల కేసులో నిందితురాలైన సాధ్వీ ప్రజ్ఞ గత ఏడాదే తగినన్ని సాక్ష్యాధారాలు లేవని ఎన్ఐఏ కోర్టు ప్రకటించడంతో విడుదలయ్యారు.

పదునైన వ్యాఖ్యల యుద్ధం ఖాయం
2008 మాలేగావ్ పేలుళ్ల కేసులో అరెస్టయిన తర్వాత సాధ్వీ ప్రజ్ఞా సింగ్ ఠాకూర్ పేరు మొదటిసారిగా చర్చల్లోకి వచ్చింది. ఈ కేసులో ఆమె జైల్లో కూడా ఉన్నారు. 2017లో సాక్ష్యాలు లేవంటూ ఎన్ఐఏ కోర్టుకి తెలిపి ఆమెకి బెయిల్ ఇస్తే అభ్యంతరం లేదని స్పష్టం చేసింది. ఆ తర్వాత సాధ్వీ ప్రజ్ఞా ఠాకూర్ కి పెద్ద ఊరటనిస్తూ బాంబే హైకోర్ట్ ఆమెను బెయిల్ పై విడుదల చేసింది. ఈ 9 ఏళ్లు ఆమె జైలు శిక్ష అనుభవించారు. సాధ్వీ తన పదునైన వ్యాఖ్యలతో ఎప్పుడూ వార్తల్లో వ్యక్తిగా ఉంటూ వచ్చారు. ఆమె అప్పటి హోమ్ మంత్రి పీ చిదంబరం 'హిందూ ఉగ్రవాదం' మాట అనడంపై తీవ్రంగా విమర్శించారు. 2018లో గుజరాత్ లోని ఒక కార్యక్రమంలో ఆమె యుపిఏ చైర్ పర్సన్ సోనియా గాంధీని 'ఇటలీకి చెందిన పనిమనిషి' అన్నారు. మధ్యప్రదేశ్ లోని భిండ్ లో జన్మించిన సాధ్వీ ప్రజ్ఞా తండ్రి ఒక ఆయుర్వేద డాక్టర్. రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ లో పనిచేశారు. అందువల్ల ప్రజ్ఞా ఠాకూర్ చిన్ననాటి నుంచే సంఘ్ కార్యకలాపాలవైపు ఆకర్షితురాలయ్యారు. చరిత్రలో మాస్టర్స్ పట్టా పొందిన ప్రజ్ఞా సంఘ్ తో అనుబంధం పెరిగిన తర్వాత సన్యాసం స్వీకరించారు. భోపాల్ సీటులో ఈ సారి ఇద్దరు ప్రధాన అభ్యర్థులు కూడా తమ పదునైన వ్యాఖ్యలకు పేరొందారు. అందువల్ల రాబోయే రోజుల్లో భీకరమైన మాటల యుద్ధం ఖాయంగా కనిపిస్తోంది.

రాజకీయ చాణక్యుడితో సాధ్వీ మొదటి పోరు
సాధ్వీ ప్రజ్ఞా ఠాకూర్ తన ప్రసంగాలతో వార్తల్లో నిలిచారు. హిందూ వ్యతిరేక, దేశ వ్యతిరేక శక్తులపై దాడి అంటూ ఆమె కాంగ్రెస్ లోని పలువురు నేతలపై అనేక మార్లు విమర్శలు రువ్వారు. వీరిలో దిగ్విజయ్ సింగ్ కూడా ఉన్నారు. డిగ్గీ రాజా దేశద్రోహి అని, తన శత్రువు అని సాధ్వీ అనేకసార్లు చెప్పారు. విద్యార్థి నాయకురాలైన ప్రజ్ఞా ఠాకూర్ హఠాత్తుగా ఏబీవీపీ వదిలేసి అవధేశానంద్ మహారాజ్ ప్రభావంతో సాధ్వీగా మారారు. గ్రామగ్రామానికి వెళ్లి హిందూత్వం ప్రచారం చేసేవారు. ఆమె సూరత్ ను తన కార్యస్థలంగా ఎంచుకొని అక్కడ ఒక ఆశ్రమం ఏర్పాటు చేసుకున్నారు. హిందూత్వ ప్రచారం కారణంగా ఆమె బీజేపీ నేతలతో టచ్ లో ఉంటూ వచ్చారు. మెల్లమెల్లగా రాజకీయాల్లో ఆమె స్థాయి పెరిగి ఇప్పుడు లోక్ సభ టికెట్ దక్కింది. ఇప్పుడు ఆమె రాజకీయ చాణక్యుడిగా పేరున్న దిగ్విజయ్ సింగ్ తో తలపడుతున్నారు. దిగ్విజయ్ ఇప్పటికే కాలినడకన నర్మద ప్రదక్షిణ చేశారు. దీంతో కాంగ్రెస్ నేతలంతా ఆయనను హిందూ వ్యతిరేకిగా విమర్శించడంపై ఎదురుదాడి చేస్తూ ఆయన పెద్ద హిందువుగా ప్రచారం చేస్తున్నారు.

ఇక గెలుపోటముల విషయానికొస్తే దిగ్విజయ్ కాస్త ఇబ్బందికర పరిస్థితిని ఎదుర్కొంటున్నారు. కఠినమైన సీటు నుంచి పోటీ చేయాలని ముఖ్యమంత్రి కమల్ నాథ్ సవాల్ విసిరి ఏరికోరి భోపాల్ సీటు డిగ్గీకి ఇచ్చారు. చాలా కాలం రాష్ట్ర రాజకీయాలకు దూరంగా ఢిల్లీలో మకాం వేసిన దిగ్విజయ్ సింగ్ ఇప్పుడు పార్టీ శ్రేణులను ఒక్కతాటిపైకి తెచ్చేందుకు తంటాలు పడుతున్నారు. మరోవైపు 30 ఏళ్లుగా భోపాల్ నుంచి ఓటమి ఎరుగని బీజేపీ, మరోసారి విజయం సాధించాలని ఉరకలేస్తోంది. సాధ్వీ ప్రజ్ఞాకు అటు అధిష్ఠానం అండదండలతో పాటు ఇటు స్థానిక నాయకత్వం నుంచి పుష్కలంగా సహకారం లభించేలా ఉంది.