అసలు సీఎం కేసీఆర్ ఢిల్లీ పర్యటన ఎందుకు..?

అసలు సీఎం కేసీఆర్ ఢిల్లీ పర్యటన ఎందుకు..?

దుబ్బాక బైపోల్, జీహెచ్‌ఎంసీ ఎన్నికల తర్వాత తెలంగాణ సీఎం కేసీఆర్ ఢిల్లీ పర్యటన రాజకీయంగా తీవ్ర చర్చకు దారి తీసింది. దుబ్బాక ఉప ఎన్నిక, గ్రేటర్ ఎన్నికల్లో బీజేపీ, టిఆర్ఎస్ ల మధ్య మాటల తూటాలు పేలాయి. ఆ వెంటనే కేసీఆర్ ఢిల్లీ పర్యటనలో అమిత్ షా ను... ఆ తర్వాత ప్రధాని నరేంద్ర మోడీని కలవడం పై అనేక అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. కేంద్ర మంత్రులు హార్దిప్ సింగ్ పూరీ, గజేంద్ర సింగ్ షెకావత్ లతో కేసీఆర్ భేటీపై పెద్దగా చర్చ జరుగలేదు. టీఆర్ఎస్, బీజేపీలది గల్లీలో కుస్తీ, ఢిల్లీలో దోస్తీ అని విమర్శించింది కాంగ్రెస్. ఇటు కేసీఆర్ ఢిల్లీ పర్యటన ఎందుకో చెప్పాలని డిమాండ్ చేశారు తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్.. 

అయితే, కేసీఆర్ ఢిల్లీ పర్యటనపై వస్తున్న విమర్శలను తిప్పికొట్టింది టీఆర్ఎస్. రాజ్యాంగ బద్ధంగానే ప్రధాని మోడీని... సీఎం కేసీఆర్ కలిసారని టీఆర్ఎస్ స్పష్టం చేసింది. రాష్ట్రానికి సంబంధించిన అంశాలపై చర్చించారని టీఆర్ఎస్ ఎమ్మెల్యే బాల్క సుమన్ అన్నారు. పీఎం మోడీని కలిసి రాష్ట్రానికి సంబంధించిన అంశాలను కేసీఆర్ మాట్లాడారని, అంతకు మించి ఏం ఉంటుందని ప్రశ్నించారు బాల్క సుమన్. గతంలో కూడా మోడీని కేసీఆర్ కలిసారని గుర్తు చేశారు సుమన్. కానీ, మొత్తంగా కేసీఆర్ ఢిల్లీ పర్యటన రాజకీయంగా దుమారం లేపింది. కేసీఆర్ ఢిల్లీ పర్యటన తర్వాత చోటు చేసుకునే రాజకీయ సమీకరణాలపై ఇప్పడు అందరి దృష్టి ఉంది. సీఎం కేసీఆర్ ఏం చేయబోతున్నారు.. ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటున్నారు.. ఆయన అడుగులు ఎటువైపు పడుతున్నాయనే చర్చ ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.