రాఫెల్‌ కోసం మరో ఆఫర్ ను తొక్కేశారా?

రాఫెల్‌ కోసం మరో ఆఫర్ ను తొక్కేశారా?

రాఫెల్‌ ఫైటర్ విమానాల కొనుగోలు వివాదం మరింత ముదురుతోంది. రాఫెల్‌ డీల్‌ కంటే ముందే.. మరింత చౌక ఆఫర్ వస్తే ఎన్డీఏ ప్రభుత్వం పట్టించుకోలేదని  వార్తలు వస్తున్నాయి.  రాఫెల్‌ కన్నా తక్కువ మొత్తానికి యూరో ఫైటర్స్‌ సరఫరా చేస్తామని బ్రిటన్, జర్మనీ దేశాలు ముందుకు వచ్చినా ఎన్డీఏ ప్రభుత్వం పట్టించుకోలేదు. గతంలో ఇదే ఆరోపణలను కాంగ్రెస్‌ పార్టీ చేసినా పెద్దగా ప్రాధాన్యం దక్కలేదు. తాజాగా రాఫెల్‌ వివాదం పెద్ద దుమారం రేగున్న సమయంలో యూరో ఫైటర్ డీల్‌ మళ్ళీ తెరపైకి వచ్చింది.  ఒక్కో రాఫెల్‌ విమానం కోసం కేంద్రం ఏకంగా 197 మిలియన్ యూరోలు వెచ్చిస్తుండగా... అదే సామర్థ్యమున్న యూరో ఫైటర్ ను  138 మిలియన్ యూరోలకే ఇస్తామని ముందుకు వచ్చాయి.  అంటే రాఫెల్‌ ఆఫర్‌ ఒక్కో విమానం రూ. 670 కోట్లయితే... యూరోపియన్ కన్సార్టియం ఒక్కో విమానానికి చేసిన ఆఫర్ రూ. 453 కోట్లు.  అయితే ప్రభుత్వం 36 రాఫెల్‌ విమానాల కొనుగోలుకు డీల్ కుదుర్చుకోగా... యూరోపియన్ దేశాల కన్సార్టియం నుంచి వచ్చిన ఆఫర్ 126 యూరో ఫైటర్స్ కు ఉద్దేశించింది.  పైగా రాఫెల్ డీల్ లో భాగంగా ప్రభుత్వం డలాస్ట్ కు 71 కోట్ల యూరోలను అదనంగా కూడా చెల్లించాల్సి ఉంది. యూరో ఫైటర్ డీల్ తుది దశ వరకు రాలేదు. రాఫెల్ కు  సంబంధించిన సాంకేతిక పరిజ్ఞానం అనిల్ అంబానీ కంపెనీకి ఇచ్చేలా ఒప్పందం కుదిరింది (యూపీఏ హయాంలో ఈ టెక్నాలజి ప్రభుత్వ రంగ సంస్థ హెచ్ ఏఎల్ కు ఇచ్చేలా ప్రతిపాదించారు)  యూరో ఫైటర్ తయారీదారులు కూడా ఈ విమానాల తయారీ  టెక్నాలజీని ప్రభుత్వ రంగ సంస్థకు బదిలీకి సంసిద్ధత వ్యక్తం చేశారు.


యూరప్ దేశాలు సంయుక్తంగా యూరో ఫైటర్ ను తయారు చేశాయి. వీటిని అమ్మేందుకు జర్మనీ, బ్రిటన్ తమ శాయశక్తులా కృషి చేసినా ఫలితం లేకపోయింది.  సంఖ్యా పరంగా అధిక యూరో ఫైటర్లను భారత్ కొనాల్సి ఉంటుందని ప్రభుత్వం  అంటున్నా... అయితే ప్రాథమికదశలోనే ఈ ఆఫర్ ను పట్టించుకోక పోవడంతో తదుపరి అంశాలు చర్చ గురించి మాట్లాడటం సరికాదని రక్షణ రంగ నిపుణలు అంటున్నారు. యూరో దేశాలతో చర్చలు జరిపి ఉంటే ధర లేదా విమానాల సంఖ్య తగ్గించడానికి ఆస్కారం ఉండేదేమో అని వీరు అంటున్నారు.  మొత్తానికి దేశ ఖజానికి వందల కోట్లు ఆదా అయ్యే ప్రతిపాదనను భారత్ ఎందుకు పట్టించుకోలేదని విమర్శలు వస్తున్నాయి. తాజాగా కాంగ్రెస్ పార్టీ రాఫెల్ డీల్ గురించి పదే పదే ప్రశ్నిస్తున్న సమయంలో యూరో ఫైటర్ వ్యవహారం మళ్ళీ బయటికి రావడం విశేషం.

ఎయిర్ బస్‌ డిఫెన్స్ అండ్ స్పేస్ కంపెనీ అధికారి భారత్ కు రాసిన లేఖ