మొదటి వన్డేలో భారత్ పై విండీస్ జయకేతనం

మొదటి వన్డేలో భారత్ పై విండీస్ జయకేతనం


టీమిండియాకు సొంతగడ్డపై పరాజయం ఎదురైంది. కొన్నాళ్లుగా వన్డే క్రికెట్‌లో సొంతగడ్డపై రాణిస్తున్న భారత్ జట్టుకు వెస్టిండీస్ పరాజయాన్ని రుచి చూపించింది. మూడు వన్డేల సిరీస్ లో భాగంగా చెన్నైలో జరిగిన తొలి మ్యాచ్ లో విండీస్ 8 వికెట్ల తేడాతో గ్రాండ్‌ విక్టరీ కొట్టింది పొలార్డ్‌ సేన. 13 బంతులు మిగిలి ఉండగానే టీమిండియా సెట్‌ చేసిన టార్గెట్‌ను ఈజీగా ఛేజ్‌ చేసింది విండీస్ టీమ్‌.  288 పరుగుల టార్గెట్‌తో బ్యాటింగ్‌కు దిగిన విండీస్ జట్టుకు ఆదిలోనే షాక్‌ తగిలింది. 11 పరుగుల వద్ద ఓపెనర్‌ సునీల్‌ అంబ్రోస్‌ వికెట్‌ కోల్పయింది. వన్‌డౌన్‌లో బ్యాటింగ్‌కు దిగిన హెట్‌మేయర్‌ టీమిండియా బౌలర్లకు చుక్కలు చూపాడు. విధ్వంసకర బ్యాటింగ్‌తో టీమిండియా బౌలర్లను ఒత్తిడిలోకి నెట్టాడు.  

106 బంతుల్లో 139 పరుగులు చేసి విండీస్ జట్టు విజయంలో కీ రోల్‌  పోషించాడు. ఏడు సిక్స్‌లు, 11 ఫోర్లతో చెలరేగి ఆడాడు. మరో బ్యాట్స్‌మెన్ షై హోప్‌ మ్యాచ్‌ ముగిసే వరకు క్రీజులో ఉండి సెంచరీతో ఆకట్టుకున్నాడు. ఆచితూచి ఆడుతూ హెట్‌మేయర్‌కు సహాకారాన్ని అందించాడు షై హోప్‌.   వీరిద్దరూ రెండో వికెట్‌కి 218 పరుగుల పార్టనర్‌షిప్‌ని నెలకొల్పారు. చివర్లో నికోలస్ పూరన్ మెరుపులు మెరిపించడంతో 13 బంతులు మిగిలుండగానే విజయాన్ని అందుకుంది. అంతకు ముందు బ్యాటింగ్‌కు దిగిన టీమిండియా 25 పరుగులకే రెండు వికెట్లు కోల్పయి కష్టాల్లో  పడింది.

శ్రేయస్‌ అయ్యర్‌, రోహిత్‌ ఇన్నింగ్స్‌ని చక్కదిద్దే ప్రయత్నం చేశారు. కానీ, 36 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద పెవిలియన్‌ బాట పడ్డాడు రోహిత్‌. ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన పంత్‌తో కలిసి ఇన్నింగ్స్‌ని నిలబెట్టాడు శ్రేయస్‌. వీరిద్దరూ హాఫ్‌ సెంచరీలతో మెరిశారు. ఆఖర్లో జాదవ్‌ 40 పరుగులు చేయడంతో టీమిండియా ఆ మాత్రం స్కోరైనా చేయగలిగింది. హిట్టర్లు జడేజా, శివమ్‌దూబే తక్కువ స్కోరుకే పెవిలియన్‌ బాట పట్టారు. విండీస్ బౌలర్లలో కాట్రెల్, కీమో పాల్, జోసెఫ్‌లకు తలో రెండు వికెట్లు దక్కాయి. పొలార్డ్ ఒక వికెట్ తీశాడు.