అమరుడైన భర్త కోసం...

అమరుడైన భర్త కోసం...

అమర జవాను కోసం ఆయన భార్య ఓ సంచలన  నిర్ణయం తీసుకున్నారు. భర్త వీరమరణం తర్వాత  సైన్యంలో చేరి తాను కూడా భరతమాత సేవలో తరించాలని భావించింది. అంతే  అనుకున్నదే తడవుగా ఆమె సైన్యంలో చేరింది. వివరాల్లోకి వెళితే...ముంబైలోని విహార్ ప్రాంతానికి చెందిన గౌరీ ప్రసాద్ మహదిక్ భర్త ప్రసాద్ గణేశ్ ఆర్మీ మేజర్‌గా సేవలు అందించారు. భారత్-చైనా సరిహద్దుల్లో విధులు నిర్వహిస్తూ 2017లో ప్రాణాలు కోల్పోయారు. పెళ్లైన రెండేళ్లకే భర్తను కోల్పోవడంతో గౌరీ కలలన్నీ తల్లకిందులయ్యాయి. అయితే ఆమె అక్కడితో ఆగిపోలేదు. అప్పటి వరకు తాను పనిచేస్తున్న ఓ కంపెనీకి రాజీనామా చేసి సైన్యంలో చేరాలని నిర్ణయించకున్నారు. అనుకున్నట్టుగానే సంవత్సరం పూర్తయ్యేలోపు ఆర్మీ ఉద్యోగం సంపాదించి ఆఫీసర్స్ ట్రైనింగ్ అకాడమీలో అడుగుపెడుతున్నారు. ఆమె న్యాయవాది, కంపెనీ సెక్రటరీ కూడా. కానీ భర్త చనిపోయిన తర్వాత ఉద్యోగం వదిలేసి ఆర్మీ ఉద్యోగంలో చేరారు. తన భర్తకు నిజమైన నివాళి అర్పించేందుకే ఈ నిర్ణయం తీసుకున్నాను అంటున్నారు.