రివ్యూ : W/O రామ్

రివ్యూ : W/O రామ్

నటీనటులు: మంచు లక్ష్మి,  సామ్రాట్‌,  ప్రియదర్శి, ఆదర్శ్‌ బాలకృష్ణ, 

మ్యూజిక్: రఘు దీక్షిత్‌

ఫోటోగ్రఫి: సామల భాస్కర్‌

నిర్మాత: వివేక్ కూచిభొట్ల 

దర్శకత్వం: విజయ్‌ యేలకంటి

రిలీజ్ డేట్: 20-07-2018

హీరోల కుమార్తెలు సినిమాల్లోకి రావడం చాలా అరుదు.  ఒకవేళ ఇంటరెస్టింగ్ గా ఉండి వస్తే.. ఒకటి రెండు సినిమాల్లో కనిపించి మాయం అవుతుంటారు.  మోహన్ బాబు కుమార్తెగా సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చిన మంచు లక్ష్మి, తనదైన నటనతో మంచి పాత్రలు చేస్తూ దూసుకుపోతున్నది.  అనగనగా ఓ ధీరుడు, దొంగాట, బుడుగు, గుండెల్లో గోదారి, చందమామ కథలు వంటి చిత్రాల్లో నటించిన మంచు వారమ్మాయి ఇప్పుడు వైఫ్ ఆర్ రామ్ గా ప్రేక్షకుల ముందుకు వచ్చింది.  సస్పెన్స్ థ్రిల్లర్ గా వచ్చిన ఈ సినిమా ఏ మేరకు మెప్పించిందో చూద్దాం. 

కథ : 

సామ్రాట్, మంచులక్ష్మీ భార్యాభర్తలు.  వీరిది ప్రేమ వివాహం.  మంచు లక్ష్మి ఆరునెలల గర్భవతిగా ఉన్నప్పుడు జరిగిన ఓ ప్రమాదంలో కడుపులో ఉన్న బిడ్డ, భర్త సామ్రాట్ చనిపోతారు.  అయితే అది ప్రమాదం కాదని, హత్యఅనే అనుమానం వ్యక్తం చేస్తుంది మంచులక్ష్మీ.  సామ్రాట్ ను హత్య చేశారనే విషయాన్ని నిరూపించడానికి ఎలాంటి ఆధారాలను సేకరించలేకపోతారు పోలీసులు.  దీంతో దీక్షనే స్వయంగా రంగంలోకి దిగి పోలీస్ కానిస్టేబుల్ సహాయంతో నిజానిజాలను వెలికితీసే ప్రయత్నం చేస్తుంది. ఇలా ప్రయత్నించే సమయంలో ఆమెకు ఎదురైన సవాళ్లు ఏంటి..? సామ్రాట్ ను ఎవరు ఎందుకు చంపారు? అన్నది మిగతా కథ. 

విశ్లేషణ : 

కహాని సినిమా గుర్తుంది కదా.  ఆ సినిమా స్పూర్తితో వైఫ్ ఆఫ్ రామ్ కథను తయారు చేసుకున్నారా అనిపిస్తుంది.  కహాని, వైఫ్ ఆఫ్ రామ్ కథలు డిఫరెంట్ గా ఉన్నా.. కథను నడిపిన తీరు, ముగించిన విధానం రెండు ఒకేతీరుగా ఉన్నాయి.  ఈ సినిమా అంతటికి ముగింపే బలం.  క్లైమాక్స్ లో వచ్చే సన్నివేశాలు కట్టిపడేస్తాయి.  కంటితడి పెట్టిస్తాయి.  క్లైమాక్స్ వరకు కథలో పట్టు తప్పకుండా మలుపులతో కూడిన కథనాలను రాసుకున్న తీరు బాగుంది.  భర్తను హత్య చేసిన హంతకుడు ఎవరు అనే విషయం ఇంటర్వెల్ కు ముందు తేలిపోతుంది.  దీంతో సెకండ్ హాఫ్ లో దర్శకుడు ఏం చెప్పబోతున్నాడనే ఉత్కంఠత కలుగుతుంది.  ఉత్కంఠతను అలాగే కొనసాగించడంలో దర్శకుడు కొంత విఫలం అయ్యాడు.  ప్రీ క్లైమాక్స్ వరకు సినిమా కొద్దిగా విసుగు తెప్పిస్తుంది. క్లైమాక్స్ కు ముందు ఇచ్చిన ట్విస్ట్ తో సినిమా మరలా వేగం పుంజుకుంటుంది.  ముగింపు మాత్రం అద్భుతంగా ఉంటుంది.  సెకండ్ హాఫ్ మొదలైనప్పటి నుంచి ప్రీ క్లైమాక్స్ వరకు ఓపికగా సినిమాను చూడగలిగితే.. ఈ సినిమా తప్పకుండా నచ్చుతుంది.  

నటీనటుల పనితీరు : 

ప్రమాదంలో భర్తను కోల్పోయి, పోలీసుల సవాళ్ళను ధీటుగా ఎదుర్కొనే మహిళ పాత్రలో మంచు లక్ష్మి నటన అద్భుతంగా ఉన్నది.  ప్రతి సన్నివేశం చాలా బాగుంది.  సినిమా మొత్తం ఆమె చుట్టూనే తిరుగుతుంది.  విలన్ పాత్రను డిజైన్ చేసిన విధానం బాగుంది.  మంచులక్ష్మీ సహకరించే కానిస్టేబుల్ పాత్రలో ప్రియదర్శి ఆకట్టుకున్నాడు.  మిగతా పాత్రలు అలా వచ్చి వెళ్తుంటాయి.  

సాంకేతికం : 

సాంకేతికంగా సినిమా బాగుంది.  బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్, ఫొటోగ్రఫీ, ఎడిటింగ్ వంటివి ఈ సినిమాకు ప్లస్ అయ్యాయి.  రాసుకున్న కథను అర్ధవంతంగా, ఆసక్తిగా తెరకెక్కించడంలో దర్శకుడు విజయం సాధించాడు.  సినిమా మొత్తం సీరియస్ గా సాగుతుంది.  ఎక్కడ వినోదం కనిపించదు.  

పాజిటివ్ పాయింట్స్ : 

మంచు లక్ష్మి 

సాంకేతిక విభాగం 

సెకండ్ హాఫ్ 

మైనస్ పాయింట్స్ : 

ఫస్ట్ హాఫ్ 

కామెడీ లేకపోవడం 

చివరిగా : ఇది మరో కహానీ..