వికీలీక్స్ వ్యవస్థాపకుడు జూలియన్ అసాంజె అరెస్ట్

వికీలీక్స్ వ్యవస్థాపకుడు జూలియన్ అసాంజె అరెస్ట్

వికీలీక్స్ సహ వ్యవస్థాపకుడు జూలియన్ అసాంజెను లండన్ లోని ఈక్వెడార్ రాయబార కార్యాలయంలో అరెస్ట్ చేశారు. ఏడేళ్ల క్రితం అసాంజె లైంగిక దాడి కేసులో స్వీడన్ కు అప్పగింతను తప్పించుకొనేందుకు ఈక్వెడార్ రాయబార కార్యాలయంలో ఆశ్రయం పొందాడు. కోర్టుకు లొంగిపోయేందుకు నిరాకరించడంతో అతనిని అరెస్ట్ చేసినట్టు మెట్ పోలీసులు తెలిపారు.

అంతర్జాతీయ చట్టాలను పదేపదే ఉల్లంఘిస్తుండటంతో ఆసాంజెకు ఆశ్రయాన్ని ఉపసంహరించినట్టు ఈక్వెడార్ అధ్యక్షుడు లెనిన్ మోరెనో చెప్పారు. అయితే వికీలీక్స్ మాత్రం ఈక్వెడార్ అసాంజె రాజకీయ ఆశ్రయాన్ని ఉపసంహరించడంలో 'అంతర్జాతీయ చట్టాలను ఉల్లంఘించి' అక్రమంగా వ్యవహరించిందని ఆరోపిస్తూ ట్వీట్ చేసింది. బ్రిటన్ హోమ్ కార్యదర్శి సాజిద్ జావిద్ 'జూలియన్ అసాంజె ఇప్పుడు పోలీస్ కస్టడీలో ఉన్నారని నేను ధ్రువీకరిస్తున్నాను. ఆయన న్యాయబద్ధంగా యుకె న్యాయవ్యవస్థ ముందున్నారని' ట్వీట్ చేశారు. 'సహకరించినందుకు ఈక్వెడార్ కు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. వృత్తి నైపుణ్యానికి మెట్రోపోలీస్ యుకెకి అభినందనలు. ఎవరూ చట్టానికి అతీతులు కారని' జావిద్ పేర్కొన్నారు.

రాయబార కార్యాలయాన్ని వదిలి వచ్చేందుకు అసాంజె(47) నిరాకరించారు. తనను బయటికి తీసుకెళ్తే వికీలీక్స్ కార్యకలాపాలపై ప్రశ్నించేందుకు అమెరికాకు అప్పజెబుతారని అన్నారు. ఈక్వెడార్ ప్రభుత్వం ఆశ్రయాన్ని ఉపసంహరించగానే ఆ దేశ రాయబారి తమను కార్యాలయంలోకి ఆహ్వానించినట్టు స్కాట్లాండ్ యార్డ్ తెలిపింది. సెంట్రల్ లండన్ పోలీస్ స్టేషన్ లో అసాంజె కస్టడీలో ఉంటారు. వీలైనంత త్వరలో ఆయనను వెస్ట్ మినిస్టర్ మేజిస్ట్రేట్స్ కోర్టులో హాజరు పరుస్తామని ఒక ప్రకటనలో తెలియజేసింది. రెండు దేశాల మధ్య సుదీర్ఘ చర్చల అనంతరం ఈ అరెస్ట్ జరిగిందని యుకె విదేశాంగ మంత్రి సర్ అలాన్ డంకన్ అన్నారు.