కరోనాకు యాంటీడ్రగ్‌ మందులు పని చేయవా?

కరోనాకు యాంటీడ్రగ్‌ మందులు పని చేయవా?

కరోనాకు యాంటీడ్రగ్‌ వైరల్‌ మందులు పని చేయవా? మార్కెట్‌లో దొరికే మందులు విచ్చలవిడిగా వాడితే ఆరోగ్యానికి ప్రమాదం తప్పదా? WHO ఏం చెబుతోంది? దీనిపై వైద్యులు ఏమంటున్నారు?  కరోనా రాక ముందు ఏ రోగానికి ఏ మందులు వాడుతారో డాక్టర్లతో పాటు ఆయా రోగులకు మాత్రమే తెలిసేది. కాని ఇప్పుడు మందులపై చాలా మందికి అవగాహన పెంచుకున్నారు. యాంటీ వైరల్ డ్రగ్స్, ప్లాస్మా థెరఫీ, విటమిన్ ట్యాబ్లెట్లు ఇలా అన్నింటిపై అందరికీ ఎంతో కొంత అవగాహన వచ్చింది.

అయితే మొదట్లో రెమిడిసివీర్ యాంటీ వైరల్ ఇంజెక్షన్లను కరోనాకు వాడొచ్చని చెప్పిన ప్రపంచ ఆరోగ్య సంస్థ... ఇపుడు యాంటీ వైరల్ డ్రగ్స్ వల్ల ప్రయోజనం లేదని ప్రకటించింది.  కరోనా నియంత్రణకు వాడాల్సిన మందులపై ఇంకా పరిశోధనలు జరుగుతూనే ఉన్నాయి. ఇప్పటి వరకు కరోనాకు ఇదే అసలైన మందు అని ఎవరూ స్పష్టంగా చెప్పలేని పరిస్థితి. ఇతర రోగాల కోసం ఎప్పుడో పరిశోధనలు చేసి... తయారు చేసిన అన్ని మందులను కరోనాపై రుద్దారు. హైడ్రాక్సీ క్లోరోక్వీన్, రెమిడిసీవీర్ లాంటీ మందులను విచ్చలవిడిగా వాడేస్తున్నారు.

వాస్తవానికి కరోనా వచ్చిన వాళ్ళలో 92 శాతం మంది ఎలాంటి మందులు వాడకుండానే కోలుకున్నారు. మిగతా 8 శాతం మందిలో చాలా మందికి రెమిడిసివీర్ ఇంజక్షన్లు ఇచ్చారు. రెమిడిసివీర్ వాడడం వల్ల కొంత మంది కోలుకున్నారని డాక్టర్లు చెబుతున్నారు. కరోనాను రెమిడిసివీర్ నేరుగా తగ్గించ లేకపోయినా,  వైరల్ లోడ్‌, మల్టిప్లికేషన్‌ను బ్రేక్ చేస్తుందంటున్నారు. ముఖ్యంగా ఊపరితిత్తుల్లో ఇన్ఫెక్షన్‌ తగ్గిస్తుందని చెబుతున్నారు. అయితే... రెమిడిసివీర్‌ను విచ్చల విడిగా వాడాల్సిన అవసరం సూచిస్తున్నారు. ప్రస్తుతం రెమిడిసివీర్ వినియోగం ప్రపంచ వ్యాప్తంగా ఒక్కసారిగా పెరిగిపోయింది.

అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌కు కరోనా వచ్చినపుడు కూడా రెమిడిసివీర్ వాడుతున్నామని ప్రకటించారు. అయితే, అవసరం ఉన్నా లేకపోయినా కరోనా వస్తే రెమిడిసివీర్‌ ఇంజెక్షన్లను ఇచ్చేశారు. కానీ... రెమిడిసివీర్ వాడినంత మాత్రానా కరోనా రోగుల్లో ఎటువంటి ఫలితాలు లేవని ప్రపంచ ఆరోగ్య సంస్థ స్పష్టం చేసింది. కరోనా ఒక్కొక్కరిపై ఒక్కోలా అటాక్ చేస్తోంది. అందువల్ల అందరికి ఒకే రకమైన వైద్యం అందించే పరిస్థితి లేదు. కరోనా సోకితే విచ్చలవిడిగా మందులు వినియోగిస్తే  సైడ్‌ అఫెక్ట్స్‌ ఉంటాయని హెచ్చరిస్తున్నారు  వైద్యులు.