బీజేపీపై సూపర్ స్టార్ సంచలన వ్యాఖ్యలు..! ఏం జరిగింది..?

బీజేపీపై సూపర్ స్టార్ సంచలన వ్యాఖ్యలు..! ఏం జరిగింది..?

సూపర్ స్టార్ రజనీకాంత్ వ్యాఖ్యలు ఎప్పుడూ.. భారతీయ జనతా పార్టీకి అనుకూలంగా ఉంటారని ప్రచారం.. బీజేపీ నేతలతో సత్సంబంధాలు కలిగిఉన్న రజనీకి.. పార్టీ కీలక పోస్టు అప్పగించే అవకాశం ఉందనే పుకార్లు కూడా ఓ దశలో హల్‌చల్ చేశాయి. అయితే, ఊహించని విధంగా బీజేపీకి షాక్ ఇచ్చారు తమిళ సూపర్ స్టార్.. బీజేపీ ట్రాప్‌లో తాను పడనంటూ కుండబద్ధలు కొట్టేశారు. రాజ్‌కమల్ ఫిల్మ్ ఇంటర్నేషనల్ నూతన కార్యాలయ ప్రాంగణంలో ప్రముఖ దర్శకుడు కె. బాలచందర్ విగ్రహ ఆవిష్కరణకు హాజరైన రజనీని తిరువళ్లవర్‌ విగ్రహ వివాదంపై స్పందించాల్సిందిగా మీడియా ప్రశ్నించింది.

ఈ సందర్భంగా సంచలన వ్యాఖ్యలు చేశారు రజనీకాంత్.. నాకు కాషాయ రంగు పులమాలని బీజేపీ చూస్తోంది.. ఈ విధంగానే తిరువళ్లువర్‌కు కూడా కాషాయరంగు వేయాలని చూస్తున్నారని వ్యాఖ్యానించిన చర్చకు తెరలేపారు. ఇక, అంతేకాదు, నేను బీజేపీ వ్యక్తిని కాదు అని స్పస్టం చేసిన సూపర్ స్టార్.. నాకు కాషాయ రంగు పులమకండి అంటూ విజ్ఞప్తి చేశారు.. తిరువళ్లువర్ లాంటి గొప్ప రచయిత చుట్టూ రాజకీయం చేయకండి.. అనవసర వివాదానికి తెరలేపకండి అంటూ కీలక వ్యాఖ్యలు చేశారు. కాగా, ప్రముఖ తమిళ రచయిత తిరువళ్లువర్ విగ్రహానికి హిందూ మక్కల్ కట్చి నేత అర్జున్ సంపత్ కాషాయవస్త్రం కట్టి మెడలో రుద్రాక్ష మాలను వేసి పూజలు నిర్వహించిన సంగతి తెలిసిందే.. ఈ ఘటనపై రాష్ట్రవ్యాప్తంగా దుమారమే రేగింది.. ఇక, తాజాగా, రజనీకాంత్ చేసిన వ్యాఖ్యలు చర్చగా మారాయి.