దేశంలో ఉల్లిధరలు మళ్ళీ పెరగనున్నాయా? 

దేశంలో ఉల్లిధరలు మళ్ళీ పెరగనున్నాయా? 

కరోనా లాక్ డౌన్ సమయంలో తక్కువ ధర పలికిన ఉల్లి, ఇప్పుడు భయపెడుతున్నది.  దేశంలో ధరలు క్రమంగా పెరుగుతున్నాయి.  ఇప్పటికే దేశంలో కిలో ఉల్లి రూ.75 నుంచి రూ.100 వరకు పలుకుతున్నాయి.  రాబోయే రోజుల్లో ఈ ధరలు మరింతగా పెరిగే అవకాశం ఉన్నట్టు మార్కెట్ నిపుణులు అంచనా వేస్తున్నారు.  కరోనా కాలంలో అన్ని మూతపడ్డాయి.  రెస్టారెంట్లు, హోటళ్లు లేవు కాబట్టి ఉల్లికి డిమాండ్ అగ్గిపోయింది.  ప్రస్తుతం లాక్ డౌన్ నుంచి సడలింపులు రావడంతో అన్ని హోటళ్లు, రెస్టారెంట్లు తెరుచుకున్నాయి.  దీంతో మళ్ళి ఉల్లికి డిమాండ్ పెరిగింది.  

డిమాండ్ పెరిగినప్పటికీ ఇండియాలో తగినంత స్టాక్ ఉన్నట్టు గతంలో ప్రభుత్వం ప్రకటించింది.  అయితే, ఉల్లి స్టాక్ ఉన్నపటికీ, దిగుబడి లేకపోతె ఆటోమేటిక్ గా ధరలు పెరుగుతాయి.  ప్రతి ఏడాది సెప్టెంబర్ నెలలో ఉల్లి పంట చేతికి వస్తుంది.  అయితే, ఈ ఏడాది సెప్టెంబర్, అక్టోబర్ మాసాల్లో దేశంలో భారీ వర్షాలు కురిసిన సంగతి తెలిసిందే.  ఉల్లిపంట అత్యధికంగా పండించే మహారాష్ట్ర, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, గుజరాత్, బీహార్, మధ్యప్రదేశ్ రాష్ట్రాలలో పండిస్తారు.  అయితే, ఆయా రాష్ట్రాల్లో వర్షాలు కురవడంతో పంట దిగుబడి తగ్గిపోయింది.  దీంతో ఉల్లి రేటు పెరిగే అవకాశం ఉన్నది.  అయితే, రాష్ట్రాలు ముందు జాగ్రత్తగా ఉల్లిని తెప్పించి స్టాక్ చేస్తున్నారు.  ఉల్లి ధరలను నియంత్రించేందుకు తమిళనాడు ప్రభుత్వం ఇరాన్, ఈజిప్టు దేశాల నుంచి ఉల్లిని దిగుమతి చేసుకుంటోంది.  సెప్టెంబర్ తరువాత మరలా ఫిబ్రవరిలో పంట చేతికి వస్తుంది.  అప్పటి వరకు ఉల్లి ధరను నియంత్రణలో ఉంచగలిగితే ఆయా ప్రభుత్వాలకు ప్రజలు జేజేలు కొడతారనడంలో సందేహం అవసరం లేదు.