విరాట్ కోహ్లీకి రెస్ట్...!

విరాట్ కోహ్లీకి రెస్ట్...!

ఈ నెల 15వ తేదీ నుంచి అబుదాబి, దుబాయ్ వేదికగా ప్రారంభం కానున్న ఆసియా కప్‌లో టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ ఆడడం అనుమానంగానే ఉంది. వరుస మ్యాచ్‌లతో విరాట్‌పై తీవ్ర ఒత్తిడి నెలకొంది. దీనికి తోడు బ్యాటింగ్ భారాన్ని అతడే మెయాల్సిన పరిస్థితి. ఇప్పటికే వెన్ను నొప్పితో బాధపడుతున్న విరాట్‌... ఆసియా కప్ ముగిసిన వెంటనే టెస్ట్ సిరీస్‌కు రెడీ కావాల్సిఉంది. ఇది అతని ఆరోగ్యంపైనా, ఆటపైనా ప్రభావం చూపే అవకాశం ఉండటంతో... వచ్చే ఏడాది జరగనున్న ప్రపంచకప్‌ను దృష్టిలో పెట్టుకుని కెప్టెన్‌కు విశ్రాంతినిచ్చే అవకాశం ఉంది. విరాట్‌కు రెస్ట్ ఇస్తే... ఆసియాకప్‌లో టీమిండియా సారథ్య బాధ్యతలను రోహిత్ శర్మకు అప్పగించనున్నారు. 

ప్రపంచకప్‌కు మేటి జట్టును సిద్ధం చేయాలని నిర్ణయించిన సెలక్టర్లు మిడిలార్డర్‌లో ఆసియా కప్‌లో ప్రయోగాలు చేయాలని భావిస్తున్నారు. భారత్- ఏ, భారత్- బి జట్ల తరపున రాణించిన మనీష్ పాండే, అంబటి రాయుడులకు అవకాశం లభించవచ్చు... మయాంక్ అగర్వాల్‌కు కూడా ఛాన్స్ దక్కే సూచనలు ఉన్నాయి. ఇక బౌలింగ్‌ విభాగానికి వస్తే గాయం నుంచి కోలుకున్న భువనేశ్వర్‌, బుమ్రాలు ఆసియా కప్‌లో బాలింగ్ విభాగాన్ని లీడ్ చేసే అవకాశం ఉంది. వికెట్ కీపర్‌గా రిషబ్‌ పంత్‌కే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయంటున్నారు. ఓపెనర్లుగా ధావన్‌, రోహిత్‌ ఉండగా... వీరికి బ్యాకప్‌గా కేఎల్‌ రాహుల్‌, లేకుంటే జట్టు పరిస్థితిని బట్టి వన్‌డౌన్‌లో దింపే అవకాశం ఉంది. వచ్చే ఏడాది ఇంగ్లాండ్ వేదికగా వరల్డ్ కప్ జరగనున్న నేపథ్యంలో మిడిలార్డర్‌ను పరీక్షించాలని జట్టు యాజమాన్యం భావిస్తోన్న సంగతి తెలిసిందే.