ఐసీసీలో కీల‌క ప‌రిణామాలు... రేస్‌లోకి దాదా..!

ఐసీసీలో కీల‌క ప‌రిణామాలు... రేస్‌లోకి దాదా..!

ఐసీసీలో శశాంక్‌ మనోహర్‌ ఇన్నింగ్స్‌కు తెరపడింది. ఐసీసీకి తొలి స్వతంత్ర ఛైర్మన్‌ అయిన అతడి పదవీకాలం నిన్నటితో ముగిసింది. 2015 నవంబరులో ఐసీసీ బాధ్యతలు అందుకున్న మనోహర్‌.. పర్యాయానికి రెండేళ్ల చొప్పున రెండు పర్యాయాలు ఛైర్మన్‌గా పనిచేశాడు. నిబంధనల ప్రకారం మరో దఫా కూడా కొనసాగే వీలున్నా.. దిగిపోవాలనే నిర్ణయించుకున్నాడు శశాంక్‌ మనోహర్‌. రెండు దఫాలుగా పనిచేసిన ఆయన దిగిపోవడంతో.. కొత్త ఛైర్మన్‌ను ఎన్నుకునే వరకు వైస్‌ ఛైర్మన్‌ ఇమ్రాన్‌ ఖవాజా తాత్కాలిక ఛైర్మన్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తాడని ప్రకటించింది ఐసీసీ. వచ్చే వారం జరిగే బోర్డు సమావేశంలో కొత్త ఛైర్మన్‌ ఎన్నిక ప్రక్రియకు ఆమోదం తెలుపనున్నారు. రెండుసార్లు బీసీసీఐ అధ్యక్షుడిగా పని చేసిన మనోహర్‌.. ఐసీసీ ఛైర్మన్‌గా ఉన్న కాలంలో భారత బోర్డు ప్రాభవం తగ్గిందనే చెప్పాలి. మనోహర్‌తో బీసీసీఐకి ఎప్పుడూ పొసగలేదు. అతడికి, బోర్డుకు మధ్య చాలా విషయాల్లో విభేదాలు తలెత్తాయి. మనోహర్‌ నేతృత్వంలోని ఐసీసీ.. 'బిగ్‌ త్రీ' ఆదాయ పంపిణీ నమూనాను రద్దు చేయడంతో బీసీసీఐ ఆర్థికంగా నష్టపోయింది కూడా. భారత్‌లో నిర్వహించిన, నిర్వహించబోయే ప్రపంచకప్‌లకు పన్ను మినహాయింపు విషయంలోనూ ఐసీసీ.. బీసీసీఐకి వ్యతిరేకంగా వ్యవహరించడంలో కీలకంగా వ్యవహరించారు మనోహర్‌. ప్రస్తుతం ఆయన వైదొలిగిన తరుణంలో కొత్త ఛైర్మన్‌ బీసీసీఐతో ఎలా ఉంటాడోననే ఉత్కంఠ‌ నెలకొంది.

ఇక‌, కొత్త ఐసీసీ ఛైర్మన్‌ రేసులో బీసీసీఐ అధ్యక్షుడు సౌరభ్‌ గంగూలీ, ఈసీబీ మాజీ ఛైర్మన్‌ కొలిన్‌ గ్రేవ్స్‌ ముందు వరుసలో ఉన్నట్టు తెలుస్తోంది. వైస్ ప్రెసిడెంట్ ఖవాజా కూడా పోటీలో ఉన్నాడు. పశ్చిమ్‌ బంగ, బీసీసీఐలలో కార్యవర్గ సభ్యుడిగా గంగూలీ పదవీ కాలం ఈనెల 31తో ఆరేళ్లు పూర్తవుతుంది. జస్టిస్‌ లోధా కమిటీ సిఫార్సుల ప్రకారం.. ఆరేళ్లు పదవిని అనుభవించిన తర్వాత ఆ వ్యక్తి మూడేళ్లు విరామం తీసుకోవాలి. అయితే, ఆ విరామ కాలం నిబంధనలో సడలింపు కోరుతూ సుప్రీంకోర్టును ఆశ్రయించాడు దాదా. ఐసీసీ ఛైర్మన్‌ పదవికి గంగూలీ పోటీపడతాడా? లేదా? అన్నది అత్యున్నత స్థానం తీర్పుపై ఆధారపడి ఉంటుంది.  బీసీసీఐ అధ్యక్షుడిగా కొనసాగేందుకు సుప్రీం అనుమతిస్తే గంగూలీ ఐసీసీ వైపు చూడకపోవచ్చంటున్నారు క్రికెట్‌ పండితులు.