సుబెందు అధికారి లేకుండా బెంగాల్ లో టిఎంసి గెలుస్తుందా? 

సుబెందు అధికారి లేకుండా బెంగాల్ లో టిఎంసి గెలుస్తుందా? 

పశ్చిమ బెంగాల్ రాజకీయాలు మరింత వేడెక్కాయి.  రెండు రోజులపాటు అమిత్ షా బెంగాల్ లో పర్యటిస్తున్నారు.  ఈరోజు మిడ్నాపూర్ లో భారీ బహిరంగ సభను ఏర్పాటు చేశారు.  ఈ సభ సాక్షిగా అనేకమంది టిఎంసి నేతలు, ఎమ్మెల్యేలు బీజేపీ తీర్ధం పుచ్చుకున్నారు.  టిఎంసిలో కీలక నేతగా వ్యవహరించిన సుబెందు అధికారి కూడా బీజేపీలో జాయిన్ అయ్యారు.  2011లో టిఎంసి అధికారంలోకి రావడానికి ప్రధాన కారణం సుబెందు అధికారి చేసిన పోరాటమే.  నందిగ్రామ్ పోరాటాన్ని ముందుండి నడిపించారు.  వామపక్షాలకు కంచుకోటగా ఉన్న జంగల్ మహల్ ప్రాంతాన్ని బద్దలు కొట్టి, అక్కడి ప్రజలను టిఎంసి వైపు తిప్పడంలో కీలక భూమిక పోషించారు.  జంగల్ మహల్ ప్రాంతంలో మొత్తం 40 అసెంబ్లీ నియోజక వర్గాలు ఉన్నాయి.  ఈ ప్రాంతంపై పట్టుకోల్పోవడంతో వామపక్షాలు ఓటమిపాలయ్యాయి.  ఈ 40 నియోజక వర్గాల్లో   సూబెందు  అధికారి కుటుంబానికి మంచి పట్టు ఉన్నది.  ఈ నియోజక వర్గాలే తృణమూల్ కు కీలకంగా ఉన్నాయి.  ఇప్పుడు సుబెందు అధికారి తృణమూల్ నుంచి బయటకు రావడంతో ఆ ప్రాంతంపై టిఎంసి పట్టుకోల్పోయే ప్రమాదం ఉందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.  తృణమూల్ కాంగ్రెస్ లో మమత మేనల్లుడు హవా కొనసాగుతుండటం, మేనల్లుడికి పార్టీకి సంబంధించిన కీలక బాధ్యతలు అప్పగించాలని చూడటం పార్టీలోని అనేకమంది నేతలకు నచ్చడంలేదు.  అవకాశం కోసం ఎదురు చూస్తున్నారు. ఇందులో భాగంగానే అనేక మంది నేతలు పార్టీ నుంచి బయటకు వెళ్తున్నారు.  సుబెందు అధికారితో పాటుగా అనేకమంది నేతలు బయటకు వెళ్లిపోవడంతో మమత సర్కార్ ఇబ్బందుల్లో పడింది.  ఇప్పటికైనా జాగ్రత్తపడకుంటే, వచ్చే ఎన్నికల్లో ఇబ్బందులు ఎదుర్కొనక తప్పదని నిపుణులు హెచ్చరిస్తున్నారు.