సీబీఐ తాత్కాలిక డైరెక్టర్ నియామకం విచారణ వాయిదా

సీబీఐ తాత్కాలిక డైరెక్టర్ నియామకం విచారణ వాయిదా

సీబీఐ తాత్కాలిక డైరెక్టర్ గా ఎం. నాగేశ్వరరావుని నియమించడాన్ని సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్ విచారణను సుప్రీంకోర్ట్ ఫిబ్రవరి 6కు వాయిదా వేసింది. సీబీఐ తాత్కాలిక డైరెక్టర్ గా నాగేశ్వరరావు నియామకాన్ని ప్రశ్నిస్తూ ఎన్జీవో కామన్ కాజ్, ఆర్టీఐ కార్యకర్త అంజలీ భరద్వాజ్ పిటిషన్ దాఖలు చేశారు. ఇవాళ సమావేశం కాబోతున్న హైపవర్డ్ కమిటీ సీబీఐ చీఫ్ నియామకంపై ఏం నిర్ణయం తీసుకుంటుందో వేచి చూస్తామని జస్టిస్ అరుణ్ మిశ్రా, జస్టిస్ దీపక్ గుప్తాల ధర్మాసనం చెప్పింది. ఇవాళ సాయంత్రం ప్రధానమంత్రి నేతృత్వంలోని సెలెక్షన్ ప్యానెల్ సమావేశమై సీబీఐ కొత్త డైరెక్టర్ నియామకంపై నిర్ణయం తీసుకోనున్నట్టు అటార్నీ జనరల్ కెకె వేణుగోపాల్ కోర్టుకు తెలిపారు. నాగేశ్వరరావు నియామకం డిపార్ట్ మెంట్ ఆఫ్ పర్సనల్ అండ్ ట్రెయినింగ్ కేటాయింపుల ఆధారంగా చేసినట్టు ఏజీ కోర్టుకు తెలిపారు. అయితే సీబీఐ వంటి సంస్థను సుదీర్ఘ కాలం పాటు తాత్కాలిక డైరెక్టర్ నియంత్రణలో పెట్టరాదని ధర్మాసనం అభిప్రాయపడింది. 

ఈ వారం ప్రారంభంలో జస్టిస్ ఎన్ వి రమణ ఈ పిటిషన్ విచారణ నుంచి తప్పుకున్నారు. ఇదే కేసులో జస్టిస్ ఏకె సిక్రీ తప్పకున్న వారానికే జస్టిస్ ఎన్ వి రమణ తప్పుకోవడం విశేషం. అంతకు ముందు సీబీఐ చీఫ్ ని ఎంపిక చేసే హైపవర్డ్ కమిటీలో తాను సభ్యుడిని కనుక కేసు విచారణ నుంచి తప్పుకుంటున్నట్టు చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా రంజన్ గొగోయ్ కూడా ప్రకటించారు. జనవరి 10న సీబీఐ డైరెక్టర్ పదవి నుంచి ఆలోక్ వర్మను వివాదాస్పదంగా తొలగించిన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నాయకత్వంలోని హై పవర్డ్ కమిటీ సమావేశానికి సీజెఐ రంజన్ గొగోయ్ తరఫున జస్టిస్ సిక్రీ హాజరయ్యారు. ఆయన తను ఎందుకు విచారణ నుంచి తప్పుకుంటున్నది చెప్పలేదు.