అరుదైన దృశ్యం: ఒకే వేదికపై తల్లీకూతుర్ల పెళ్లి... 

అరుదైన దృశ్యం: ఒకే వేదికపై తల్లీకూతుర్ల పెళ్లి... 

ఒకే వేదికపై అన్నదమ్ముల పెళ్లిళ్లు, అక్క చెల్లెళ్ళ పెళ్లిళ్లు జరగడం చూశాం.  కానీ, ఒకే వేదికపై తల్లి కూతుర్ల పెళ్లి జరగడం ఎక్కడైనా చూశారా అంటే లేదని చెప్తారు.  అలాంటి అరుదైన దృశ్యం ఒకటి ఉత్తర ప్రదేశ్ వేదికగా జరిగింది.  ఉత్తర ప్రదేశ్ లో ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ సామూహిక వివాహ యోజన పథకం ప్రారంభించిన సంగతి తెలిసిందే.  ఈ పథకంలో భాగంగా అనేకమంది పేదలు వివాహం చేసుకుంటున్నారు.  గోరఖ్ పూర్ లోని పిప్రౌలిలో జరిగిన వేడుకలో 53 ఏళ్ల తల్లి బెలీదేవి, ఆమె కూతురు వివాహం జరిగింది.  బెలీదేవికి జగదీశ్ అనే వ్యక్తితో వివాహం జరగ్గా, ఆమె చిన్న కూతురు ఇందుకు రాహుల్ అనే 29 ఏళ్ల యువకుడితో వివాహం జరిగింది.  30 ఏళ్ల క్రితం బెలీకి వివాహం జరిగింది.  అయితే, పాతికేళ్ల క్రితం బెలీ తన భర్తను కోల్పోయింది.  భర్తను కోల్పోయిన తరువాత తన ఇద్దరు కుమారులు, ముగ్గురు కూతుర్లను మంచిగా చదివించింది.  ఇద్దరు కొడుకు, ముగ్గురు కూతుర్లకు ఉద్యోగాలు రాగా, నలుగురికి వివాహాలు జరిగాయి.  చివరి అమ్మాయి ఇందుకు తన తల్లితో పాటుగా వివాహం జరిగింది.  ఈ వివాహానికి కొడుకులు, కూతుర్లు హాజరు కావడం విశేషం.