నికా చేసిన మహిళా ఖాజీ

నికా చేసిన మహిళా ఖాజీ

సంస్కృతి సంప్రదాయాల పేరుతో మహిళల మత స్వేచ్ఛకు సంకెళ్లు వేసినప్పటికీ ఈ నెల ఆరంభంలో ఒక ముస్లిం జంట మహిళా ఖాజీ సాక్షిగా ఒక్కటైంది. ముంబైకి చెందిన మాయ, షమౌన్ లు జనవరి 5న కోల్ కతాలో ఖాజీ హకీమా ఖతూన్ ప్రమాణాలు చదవగా పెళ్లాడారు. కొన్నేళ్ల క్రితం ఎక్కడో మహిళలు కూడా ఖాజీలుగా మారి పెళ్లిళ్లు చేయించవచ్చని చదవిన మాయ, తన వివాహం మహిళా ఖాజీనే జరిపించాలని పట్టుదలగా ప్రయత్నించి చివరకు అనుకున్నది సాధించింది.

మహిళలు నికా జరిపించడానికి ఇస్లామ్ ఎక్కడా అభ్యంతరం చెప్పలేదు. కానీ మహిళా ఖాజీలను వెతికి పట్టుకోవడం కష్టమైన పని కావడంతో ఈ పెళ్లిళ్లు అరుదుగా మారాయి. అయితే వధూవరులు మహిళా ఖాజీనే కావాలని పట్టుబట్టిన సందర్భాలలో మహిళలు నికా జరిపించిన సంఘటనలు ఉన్నాయి. భారత్ లోని ముస్లిం కుటుంబాలలో సాధారణంగా పురుషులే ఖాజీలు పెళ్లిళ్లు జరిపిస్తారు. అయితే మాయ, ఆమె కాబోయే భర్త భారతీయ ముస్లిం మహిళా ఆందోళన్ (బీఎంఎంఏ) గురించి వెబ్ సైట్ ద్వారా తెలుసుకున్నారు. ఖురాన్, రాజ్యాంగ హక్కులపై బీఎంఎంఏ మహిళలకు శిక్షణ ఇస్తున్నట్టు తెలుసుకొన్నారు. తమ పెళ్లిని మహిళా ఖాజీయే జరిపించాలని కోరారు.

మాయ, షమౌన్ ల నికాను ఒక మహిళా ఖాజీ జరిపించడం మహిళా హక్కుల పోరాటంలో కొత్త అధ్యాయంగా చెబుతున్నారు. ఒక సాధారణ ముస్లిం మహిళా కార్యకర్త ఖురాన్, రాజ్యాంగం మహిళలకిచ్చే హక్కుల కఠిన శిక్షణను పూర్తి చేసుకొని పెళ్లి జరిపించడం మామూలు విషయం కాదు. శతాబ్దాలుగా పురుషుల ఆధిపత్యం ఉన్న రంగంలో అడుగుపెట్టి తన ఉనికి చాటడం మామూలు విషయం కాదు. తన కోసం ఓ జంట వెతుక్కుంటూ రావడం, తను వాళ్ల నికా జరిపించడం ఖాజీ హకీమాకు అనిర్వచనీయమైన అనుభూతిని కలిగించింది. పురుష ఖాజీల మాదిరిగానే నికా తంతునంతా మత నియమాలను అనుసరించి, చట్టప్రకారం జరిపించింది.

బీఎంఎంఏ ఇప్పటి వరకు మహారాష్ట్ర, ఎంపీ, రాజస్థాన్, తమిళనాడు, కర్ణాటక, ఒడిషాలకు చెందిన 16 మంది మహిళా ఖాజీలకు శిక్షణ ఇచ్చింది. మహిళా ఖాజీలకు శిక్షణ వరకు సరే కానీ వారితో నికా జరిపించుకొనేందుకు ముందుకొచ్చే జంటలను వెతికి పట్టుకోవడం తమ ముందున్న అతిపెద్ద సవాలని చెబుతున్నారు బీఎంఎంఏ సహ వ్యవస్థాపకురాలు నూర్జెహాన్ సాఫియా నియాజ్.