కట్నం కోసం వేధింపులు.. మహిళ ఆత్మహత్య

కట్నం కోసం వేధింపులు.. మహిళ ఆత్మహత్య

కట్నపిశాచికి మరో అమాయకురాలు బలైంది. భర్త, అత్తమామల అదనపు కట్నం వేధింపులు భరించలేక జువ్వాడి శ్రీలత (32) అనే మహిళ.. ముంబైలోని తన మేనమామ ఇంట్లో ప్రాణాలు తీసుకుంది. 

మృతురాలి కుటుంబసభ్యుల కథనం ప్రకారం.. రామాంతపూర్‌కు చెందిన వంశీరావుతో శ్రీలతకు 2011 లో పెళ్లి జరిగింది. . 2012 నుంచి వీరు ఇంగ్లండ్‌లో ఉంటున్నారు. కొన్ని రోజులపాటు వీరి సంసారం సాఫీగా సాగినా ఆ తర్వాత అదనపు కట్నం కోసం వంశీ వేధించడం మొదలుపెట్టాడు. 2016లో శ్రీలత తల్లి చనిపోవడంతో ఇండియా వచ్చి నెల రోజుల పాటు ఉండి మళ్లీ ఇంగ్లండ్‌ వెళ్లిపోయింది. 

ఈక్రమంలో శ్రీలత గర్భవతి కావడంతో వంశీ తల్లి ఆశాలత ఇంగ్లండ్‌ వెళ్లింది. పాపకు శ్రీలత జన్మనివ్వడంతో కట్నం వేధింపులు మరింత పెరిగాయి. భర్త, అత్త కలిసి శ్రీలతను వేధింపులకు గురించేయడంతో 2018లో ఇంగ్లండ్‌లో రైలు నుంచి దూకి ఆత్మహత్యకు పాల్పడింది. ఐతే..ఈ కేసులో వంశీకి 20 ఏళ్ల జైలు శిక్ష పడుతుందనే ఉద్దేశంతో కేసును రాజీ చేసుకుంది.  

ఈక్రమంలో నెల రోజుల క్రితం ముంబైలో ఉన్న తన మేనమామ ఇంటికి శ్రీలత వచ్చింది. రెండు రోజుల క్రితం ఎవరూ లేని సమయంలో ఆత్మహత్యకు పాల్పడింది. మృతదేహాన్ని ముంబై నుంచి నిన్న రాత్రి రామాంతపూర్ లోని అత్తమామల ఇంటికి తీసుకువచ్చారు. విషయం తెలుసుకున్న శ్రీలత అత్తమామలు జువ్వాడి రాజేశ్వర్‌రావు, ఆశాలతలు ఇంటికి తాళం వేసి పరారయ్యారు. ఆత్మహత్యకు కారణమైన శ్రీలత భర్త, అత్తమామలను శిక్షించే వరకు న్యాయపోరాటం చేస్తామని మృతురాలు బంధువులు తెలిపారు.