అమ్మకానికి అతివ...మన తెలంగాణలోనే !

అమ్మకానికి అతివ...మన తెలంగాణలోనే !

 

తెలంగాణలోని కొమరం భీమ్ జిల్లాకి చెందిన ఒక ఆదివాసీ మహిళను డబ్బుకోసం విక్రయించిన ఘటన తెలుగు రాష్ట్రాల్లో కలకలం రేపుతోంది. ఉమ్మడి  ఆదిలాబాద్ జిల్లాలోని తిర్యాణి మండలానికి చెందిన మహిళను మధ్యప్రదేశ్ చెందిన వ్యక్తికి విక్రయించారు. తన కూతురు కనిపించడం లేదని మహిళ తల్లి ఫిర్యాదు చేయడంతో ఈ వ్యవహారం వెలుగులోకి వచ్చింది. ఫిర్యాదు అందుకున్న పోలీసులు లోతుగా దర్యాప్తు చేయడంతో మహిళ విక్రయం విషయం వెలుగులోకి వచ్చింది. దళారుల చేతిలో మోసపోయి ఎక్కడో మధ్య ప్రదేశ్ లో చిక్కిన ఆ మహిళ ఎలాగోలా అక్కడి నుంచి తప్పించుకుని వచ్చి పోలీసులకు అంతా చెప్పడంతో మరిన్ని విషయాలు తెలిశాయి.

పూర్తి వివరాల్లోకి వెళితే తిర్యాణి మండలంలో ఒక గిరిజన గూడానికి చెందిన ఓ మహిళకు గతంలో ఓ వ్యక్తితో వివాహం జరిగింది. అయితే భర్తకు పెళ్లి అయిన రెండేళ్లకే మతి స్థిమితం కోల్పోవడంతో గత కొంత కాలంగా పుట్టింటిలోనే ఉంటోంది. ఇది గమనించిన వారి సమీప బంధువు మరో వ్యక్తి, అలాగే ఆసిఫాబాద్‌ పోలీసు స్టేషన్‌లో కోర్టు కానిస్టేబుల్‌ గా పని చేస్తున్న మరో వ్యక్తి  కలసి బాధితురాలకి మాయ మాటలతో ఉద్యోగం ఇప్పిస్తామని చెప్పి తీసుకెళ్లి ఇతర ప్రాంతానికి అమ్మేసేందుకు ప్రణాళిక వేశారు. ఈ ముగ్గురు కలసి బాధితురాలి ఇంటికి గత నెల 1న రాత్రి వెళ్లి ఉద్యోగంలో పెట్టిస్తామని ఈ రాత్రే బయలు దేరి రావాలంటూ ఆమె తండ్రిని ఒప్పించారు.

అదే రాత్రి ఇంటి నుంచి తీసుకొచ్చి ఆసిఫాబాద్‌లోని పోలీసు కానిస్టేబుల్‌ ఇంట్లో ఉంచారు. ఆ మర్నాడు కాగజ్‌నగర్‌ రైల్వేస్టేషన్‌కు తీసుకెళ్లి మధ్యప్రదేశ్‌ వెళ్లే ట్రైన్‌ లో ఎక్కించి దాదాపు రెండు రోజుల ప్రయాణం తర్వాత మధ్యప్రదేశ్‌లోని మంద్‌సూద్‌ జిల్లా గరవాద్‌కు చెందిన ఓ వ్యక్తి ఇంటికి తీసుకెళ్లారు. అక్కడి రాజ్‌పుత్‌ సామాజిక వర్గానికి చెందిన ఆ వ్యక్తి బాధితురాలిని శారీరకంగా వాడుకోవడమే కాకుండా ఇంటి పనులు చేయిస్తూ నరకం చూపించాడట. బాధితురాలు ఆ వ్యక్తిని గట్టిగా నిలదీయడంతో తనను రూ.1.30 లక్షలు కొనుగోలు చేసినట్లు వెల్లడించడంతో ఎలాగైనా అతని బారి నుంచి తప్పించుకోవాలని చూసిన ఆమె ఎట్టకేలకు ఇంటికి చేరి పోలీసులకు విషయాలన్ని తెలిపింది. నిందితుల మీద ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ, కిడ్నాపింగ్, రేప్, మానవ అక్రమ రవాణా తదితర సెక్షన్ల కింద కేసులు నమోదు చేసి రిమాండ్ కి పంపారు పోలీసులు.