గుజరాత్‌లో మరో దారుణం... మహిళలను గుంపుగా నగ్నంగా నిలబెట్టి...!

గుజరాత్‌లో మరో దారుణం... మహిళలను గుంపుగా నగ్నంగా నిలబెట్టి...!

ఓవైపు మహిళలు అన్ని రంగాల్లో రాణించాలంటూనే... మరోవైపు వాళ్లు గడప దాటాలంటే భయపడేలా చేస్తున్నారు. కొన్ని ఉద్యోగాలకు సంబంధించి నిబంధనలు మహిళల మనోభావాల్ని దెబ్బతీసేలా ఉంటున్నాయి. తాజాగా, గుజరాత్‌లో సూరత్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌లో జరిగిన తంతు దీనికి ఓ ఉదాహరణ మాత్రమే. అంతేకాదు.. సాటి మహిళలు ఆలోచన లేకుండా అక్కడి మహిళా డాక్టర్‌ వ్యవహరించిన తీరుపై విమర్శలు వెల్లువెత్తున్నాయి. వివరాల్లోకి వెళ్తే.. సూరత్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌ నిబంధనల ప్రకారం... క్లర్క్‌లు తదితర ఉద్యోగాలకు సంబంధించి మూడేళ్ల ట్రైనింగ్‌ పూర్తయిన వాళ్లు మెడికల్‌ టెస్ట్‌కు హాజరు కావల్సి ఉంటుంది. ఉద్యోగం చేసేందుకు శారీరకంగా ఫిట్‌గా ఉన్నారా? లేదా? అనేది నిర్ధారించేందుకే ఈ మెడికల్‌ టెస్ట్‌. అయితే, మూడేళ్ల ట్రైనింగ్‌ పూర్తి  చేసుకుని... సూరత్‌ మున్సిపల్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌ ఎడ్యుకేషన్‌ అండ్‌ రీసెర్చ్‌ ఆసుపత్రికి మెడికల్‌ టెస్ట్‌కు వెళ్లిన వంద మంది మహిళా క్లర్క్‌లకు చేదు అనుభవం ఎదురైంది.  గైనకాలజీ విభాగంలో వీళ్లను గ్రూపులుగా విడదీశారు. ఒక్కో గదిలో పది మంది చొప్పున నగ్నంగా నిలబడేలా ఒత్తిడి చేశారు ఆస్పత్రి సిబ్బంది. 

ఇక, ఒకరి తర్వాత ఒకరిని లోపలికి పిలవకుండా అందర్నీ ఒకేసారి రమ్మన్నారని... వెళ్లాక నగ్నంగా నిలబెట్టి పరీక్షించారని వాపోతున్నారు బాధిత మహిళలు. మరీ ముఖ్యంగా అక్కడి లేడీ డాక్టర్‌ ప్రెగ్నెన్సీ గురించి ఇబ్బందికర ప్రశ్నలతో  వేధించారన్నారు. మున్సిపల్‌ కమిషనర్‌కి ఉద్యోగ సంఘాలు ఫిర్యాదుతో ఈ ఘటనపై విచారణకు ఆదేశించారు. ముగ్గురు సభ్యులతో కమిటీ ఏర్పాటు చేశారు. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని సూరత్‌ మేయర్‌ జగదీశ్‌ పటేల్‌ హామీ ఇచ్చారు. ఈ ఘటనపై గుజరాత్‌ మహిళా కమిషన్‌తో పాటు నేషనల్‌ కమిషన్‌ ఫర్‌ విమెన్‌ -ఎన్‌సీడబ్ల్యూ కూడా స్పందించాయి. సమగ్ర దర్యాప్తు జరిపించాల్సిందిగా గుజరాత్‌ చీఫ్‌ సెక్రటరీ, ప్రిన్సిపల్‌ సెక్రటరీలను ఆదేశించింది ఎన్‌సీడబ్ల్యూ. అలాగే, బాధ్యులపై ఎలాంటి చర్యలు తీసుకున్నారు సాధ్యమైనంత త్వరగా తమకు నివేదించాలని స్పష్టం చేసింది. వారం క్రితం గుజరాత్‌లోని భుజ్‌ బాలికల కళాశాలలో నెలసరి పరీక్షలు నిర్వహించడం దేశ వ్యాప్తంగా కలకలం రేపాయి. దీనిపై కూడా జాతీయ మహిళా కమిషన్ విచారణకు ఆదేశించింది. ఆ ఘటన మరువక ముందే... సూరత్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌ ట్రైనీ క్లర్కుల్ని అవమానపర్చేలా నగ్నంగా నిలబెట్టడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.