ఫిఫా: మరో మాజీ చాంపియన్‌ నిష్క్రమణ

ఫిఫా: మరో మాజీ చాంపియన్‌ నిష్క్రమణ

అంచనాలు లేని రష్యా జట్టు సొంతగడ్డపై విజయం సాధించి ప్రపంచ కప్‌ ఫుట్‌బాల్‌ క్వార్టర్స్‌లో అడుగుపెట్టింది. ఆదివారం రష్యా, స్పెయిన్‌ జట్ల మధ్య జరిగిన ప్రీక్వార్టర్స్‌లో పెనాల్టీ షూటౌట్‌లో 3-4తో రష్యా జయకేతనం ఎగురవేసింది. తొలి రౌండ్‌లో జర్మనీ.. నాకౌట్‌లో అర్జెంటీనా, పోర్చుగల్‌ జట్లు ఫిఫా ప్రపంచ కప్‌ ఫుట్‌బాల్‌  నుంచి నిష్క్రమించగా తాజాగా స్పెయిన్‌ కూడా వాటి దారిలోనే నడిచింది.

మ్యాచ్‌ తొలిభాగం 12వ నిమిషంలో రష్యా ఆటగాడు సెర్గీ ఇగ్నాషెవిచ్‌ సెల్ఫ్‌ గోల్‌ చేసి స్పెయిన్‌కు 1-0 ఆధిక్యం అందించాడు. 41వ నిమిషంలో స్పెయిన్‌ ఆటగాడు జ్యూబా గోల్‌ కొట్టి స్కోరును 1-1తో సమం చేశాడు. ఆ తర్వాత ఇరు జట్లు గోల్ చేయలేకపోయాయి. అనంతరం మరో అర గంట అదనపు సమయం ముగిసేసరికి కూడా  ఇరు జట్లు 1–1తో సమంగా నిలిచాయి. దాంతో ఫలితం షూటౌట్‌ ద్వారా నిర్ణయించాల్సి వచ్చింది. ఈ మ్యాచ్‌లో స్పెయిన్‌ కొట్టిన 24 షాట్‌లను గోల్‌ కాకుండా నిరోధించిన రష్యా కీపర్‌ అకిన్‌ఫీవ్‌.. షూటౌట్‌లోనూ జోరు కొనసాగించాడు.